రాబోయే రెండు నెలల కాలంలో ఈ జట్టుతో కలిసి అద్భుతాలు చేస్తామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హిట్‌మ్యాన్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో చోటు దక్కనివాళ్లు బాధ పడాల్సిన అవసరం లేదని.. గతంలో తాను కూడా అలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని రోహిత్ వెల్లడించాడు. పుల్‌షాట్ నుంచి పిచ్ పరిస్థితుల వరకు రోహిత్ చేసిన వ్యాఖ్యలు అతడి మాటల్లోనే..
Rohit Sharma | న్యూఢిల్లీ: స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఆడనుండటంతో ఒత్తిడి ఉండటం సహజమే. భారత జట్టుకు అది కొత్తేమి కాదు. ఇలాంటి సమయంలో బయటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మరింత టెన్షన్ పెంచుతుంది. నా వరకైతే సంయమనం పాటిస్తున్నా. ఎలాంటి వ్యాఖ్యలను దగ్గరకు రానివ్వడం లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌నకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. ఇప్పుడు కూడా మంచి ప్రదర్శన చేస్తాననే నమ్మకముంది.
మెగాటోర్నీ కోసం మెరుగ్గా సిద్ధమయ్యా. మంచి మైండ్‌సెట్‌తో ఉన్నా. ఒక్క వ్యక్తితో ఏదీ సాధ్యం కాదు. జట్టంతా సమిష్టిగా రాణిస్తేనే మెరుగైన ఫలితాలు రాబట్టగలం. వచ్చే రెండు నెలల్లో ఈ జట్టుతో కలిసి అద్భుతాలు చేస్తాం. గత 16 ఏండ్లలో నాలో పెద్దగా మార్పులేం రాలేదు. ముందు తరాలకు ఎలాంటి వారసత్వం అందిస్తామనే దానిపై నాకు విశ్వాసం లేదు. అది ప్రజలే నిర్ణయిస్తారు. అంకెలు, గణాంకాల గురించి పెద్దగా పట్టించుకోను. నా వరకైతే జట్టుతో కలిసి మంచి జ్ఞాపకాలు మిగల్చాలనుకుంటున్నా.
అప్పుడు చాలా బాధపడ్డా..
సెలెక్టర్లు, కోచ్, నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యర్థులు.. మా బలాలు, బలహీనతలు ఇలా అన్నీ విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతిసారి సరైనా నిర్ణయాలు తీసుకోలేం. ఇప్పటి వరకు ఏ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసినా.. టీమ్‌లో ప్లేస్ దక్కని ప్లేయర్లతో ప్రత్యేకంగా మాట్లాడాం. ఒక్కో ఆటగాడితో వ్యక్తిగతంగా వారికి అవకాశం రాకపోవడానికి గల కారణమేంటో చెప్పాం. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు.
2011 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కని సమయంలో నేనూ చాలా బాధపడ్డా. గదిలో నుంచి బయటకు రాకుండా ఉండిపోయా. అసలేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యువరాజ్ సింగ్ నాతో మాట్లాడి నా కర్తవ్యాలు గుర్తుచేశాడు. మయసు మించిపోలేదని.. ఇంకా చాలా సమయం ఉంది ముందు నీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోమన్నాడు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆ ప్రపంచకప్ తర్వాత జట్టులోకి వచ్చిన నేను ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు. పుల్ షాట్ ఆడేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అండర్-19 స్థాయి నుంచి దాన్ని ఆడుతున్నా. బంతి షార్ట్ పిచ్ పడిందనిపిస్తే.. అలవోకగా ఆడేస్తా.