ఆస్ట్రేలియాపై భారత్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. ఐసీసీ మెగాటోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కంగారూల పీక మణుస్తూ విజయదుందుభి మోగిం చింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అపజయమెరుగని టీమ్ఇండియా గ్రూపు-1లో అగ్రస్థానంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. రోహిత్‌శర్మ ‘హిట్‌మ్యాన్’ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను కంగారెత్తించాడు. స్టార్ పేసర్ స్టార్క్‌ను చీల్చిచెండాడుతూ రోహిత్ కొట్టిన సిక్స్‌లకు స్టేడియం హోరెత్తిపోయింది. కోహ్లీ విఫలమైనా ఆ ప్రభావం కనిపించకుండా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా, సూర్యకుమార్, దూబే, పాండ్యా దంచుడుతో భారత్ భారీ స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో హార్డ్‌హిట్టర్ వార్నర్ ఆదిలోనే నిష్క్రమించినా..ట్రావిస్ హెడ్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మరోమారు భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్ విజృంభణతో ఆసీస్ గెలుపు వాకిట బోల్తా కొట్టింది. తాజా ఓటమితో సెమీస్ రేసు నుంచి ఆసీస్ అనధికారికంగా నిష్క్రమించినట్టే! బంగ్లాదేశ్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో కాబూలీలు విజయం సాధిస్తే కంగారూల కథ కంచికే చేరినట్లే అవుతుంది.
Team India | సెయింట్‌లూసియా: గత రెండు ఐసీసీ టోర్నీ (డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్)లలో భారత ‘కప్పు కల’ను అడ్డుకున్న ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా బదులు తీర్చుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కంగారూలను 24 పరుగుల తేడాతో ఓడించింది. సెయింట్‌లూసియా వేదికగా ఇరు జట్ల మధ్య సాగిన ‘హై స్కోరింగ్ థ్రిల్లర్’లో భారత్‌దే పైచేయి అయింది.
చాలాకాలం తర్వాత భారత సారథి రోహిత్ శర్మ (41 బంతుల్లో 92, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) తనలోని ‘హిట్‌మ్యాన్’ను బయటకు తీసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 31, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. భారీ ఛేదనలో ఆస్ట్రేలియా దీటుగానే బదులిచ్చింది. ట్రావిస్ హెడ్ (43 బంతుల్లో 76, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి భారత్ పాలిట విలన్‌గా మారినా చివర్లో మన బౌలర్లు రాణించి ఆసీస్‌ను దెబ్బకొట్టడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 181/7కే పరిమితమైంది. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
హిట్‌మ్యాన్ షో..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో ఓవర్లోనే కోహ్లీ(0) వికెట్ కోల్పోయింది. హెజిల్వుడ్ వేసిన షాట్ బాల్‌ను ఆడబోయిన కోహ్లీ టిమ్ డేవిడ్ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ అందుకోవడంతో మరోసారి డకౌట్ అయ్యాడు. కానీ ఆ తర్వాతి ఓవర్ నుంచే మొదలైంది అసలు కథ. స్టార్క్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ 6, 6, 4, 6, 6 తో 29 పరుగులు పిండుకుని ఈ మ్యాచ్‌లో తన విధ్వంసం ఎలా ఉండనుందో చెప్పకనే చెప్పాడు.
ఆరో ఓవర్లో రోహిత్ బాదుడుకు బలైంది కమిన్స్. ఓ సిక్సర్, రెండు బౌండరీలతో 15 రన్స్ రాబట్టిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. 5 ఓవర్లలో భారత్ స్కోరు 52-1 గా ఉంటే అందులో రోహిత్‌వే 50 రన్స్ కావడం విశేషం. మార్ష్ వ్యూహం మార్చి జంపాకు బంతినిచ్చినా రోహిత్ రెండు సిక్సర్లతో అతడికి స్వాగతం పలికాడు. స్టోయినిస్ 8వ ఓవర్లో మూడో బంతికి డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ మీదుగా కొట్టిన సిక్సర్‌ను అయితే చూసి తీరాల్సిందే. ఇదే ఓవర్లో షాట్ ఆడబోయిన పంత్ (15) హెజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సూర్య, హార్దిక్ దూకుడు..
పంత్ వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చిన సూర్యతో కలిసి రోహిత్ వేగంగా ఆడటంతో రన్‌రేట్ ఓవర్‌కు 10.5కు తగ్గకుండా పరుగులు పెట్టింది. అయితే 90లలోకి వచ్చిన రోహిత్.. 12వ ఓవర్లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ డెలివరీని ఆడబోయి అది కాస్తా మిస్ అయి వికెట్లను తాకడంతో శతకానికి 8 పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. రోహిత్ పెవిలియన్ చేరాక కాసేపటికే సూర్య సైతం ఆఫ్‌సైడ్‌కు ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయి కీపర్ మాథ్యూవేడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆఖర్లో దూబె (28), హార్దిక్ దూకుడుతో భారత్ 200 పరుగుల మార్కును దాటింది.
మళ్లీ అతడే..!
భారీ ఛేదనలో ఆసీస్ మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ (6) వికెట్ కోల్పోయింది. కానీ ఐసీసీ టోర్నీలలో ‘భారత్‌కు విలన్’గా మారిన ట్రావిస్ హెడ్ మరోసారి రెచ్చిపోయాడు. ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ (37) తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అర్ష్‌దీప్ 3వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను వదిలేయడంతో అతడికి లైఫ్ దక్కింది. అదే ఓవర్లో అతడు 4,6 కొట్టాడు.
ఇక బుమ్రా వేసిన 4వ ఓవర్లో హెడ్ 3 బౌండరీలతో బాదుడుకు శ్రీకారం చుట్టాడు. హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకున్న హెడ్.. అతడి బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్ 9వ ఓవర్లో మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ అద్భుతంగా అందుకోవడంతో 81 పరుగులు రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హార్దిక్ 9వ ఓవర్లో 3 ఫోర్లతో హెడ్ 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన మ్యాక్స్‌వెల్ (20)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. స్టోయినిస్ (2)ను అక్షర్ బోల్తా కొట్టించాడు.
బ్రేక్ ఇచ్చిన బుమ్రా
ఆసీస్‌ను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్న హెడ్‌ను ఆపేందుకు రోహిత్ వ్యూహం మార్చి బుమ్రాకు బంతినందించాడు. 17వ ఓవర్లో బుమ్రా వేసిన మూడో బంతిని షాట్ ఆడబోయినా అది మిస్ అయినా కవర్స్‌లో రోహిత్ మాత్రం క్యాచ్‌ను మిస్ చేయలేదు. తర్వాతి ఓవర్లోనే వేడ్ (1)తో పాటు ప్రమాదకర టిమ్ డేవిడ్ (15)ను అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో ఆసీస్ ఓటమి ఖరారైంది.
1 అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
1 టీ20ల్లో 200 సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా రోహిత్ (203) ముందున్నాడు. మార్టిన్ గప్టిల్(173)ది ఆ తర్వాత స్థానం
సంక్షిప్త స్కోర్లు:
భారత్: 20 ఓవర్లలో 205/5 (రోహిత్ 92, సూర్య 31, స్టార్క్ 2/45, స్టోయినిస్ 2/56). ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 181/7 (హెడ్ 76, మార్ష్ 37, అర్ష్‌దీప్ 3/37, కుల్దీప్ 2/24)
