బంగ్లాపై ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌తో స్ఫూర్తి పొందారో.. గత మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనుకున్నారో కానీ.. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండ్రీలు, సిక్సర్లతో విజృంభించి ఆస్ట్రేలియాను బెంబేలెత్తించారు. మొదట కంగారూలు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన వీర విహారం చేయడంతో నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా.. స్మృతి, రిచా మెరుపులతో టీమ్ఇండియా వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆసీస్ 16 పరుగులకే పరిమితమవడంతో హర్మన్ బృందం మరపురాని విజయాన్ని మూటగట్టుకుంది!
ముంబై: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత పోరులో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. తద్వారా 1-1తో సిరీస్ సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. బెత్ మూనీ (54 బంతుల్లో 82 నాటౌట్; 13 ఫోర్లు), తహిలా మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకాలతో సత్తాచాటారు. కెప్టెన్ అలీసా హీలీ (25; 5 ఫోర్లు) కూడా రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 187 పరుగులే చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (49 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ (34; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్), రిచా ఘోష్ (13 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హీథెర్ గ్రహమ్ 3 వికెట్లు పడగొట్టింది.
చివరి ఓవర్లో ఉత్కంఠ
188 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు స్మృతి, షఫాలీ శుభారంభం అందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ కూడా తలో చేయి వేయడంతో భారత్ విజయం వైపు సాగింది. అయితే చివర్లో విజృంభించిన ఆసీస్ అమ్మాయిలు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి రిచా ఘోష్ సింగిల్ తీయగా.. రెండో బంతికి దేవిక బౌండ్రీ రాబట్టింది. తర్వాతి మూడు బంతుల్లో నాలుగు పరుగులే రావడంతో భారత్ విజయం కష్టమే అనిపించింది. అయితే చివరి బంతికి ఫోర్ కొట్టిన దేవిక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. పూర్తి మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన రిచా ఘోష్ తొలి బంతికే భారీ సిక్సర్‌తో మంచి స్కోరుకు బాటలు వేసింది.