ఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, ఒక రజతంతో పాటు నలుగురు బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు. శనివారం రాత్రి జరిగిన పురుషుల 70 కిలోల విభాగంలో హితేశ్.. ఒడెల్ కమర (ఇంగ్లండ్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ప్రత్యర్థి గాయంతో రింగ్ నుంచి తప్పుకోవడంతో హితేశ్ విజేతగా నిలిచాడు. అతడితో పాటు పురుషుల 65 కిలోల విభాగంలోనూ ఫైనల్ చేరిన మరో బాక్సర్ అభినాష్.. ఫైనల్లో యురి రీస్ (బ్రెజిల్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో జదుమణి సింగ్, మనీశ్ రాథోడ్, సచిన్, విశాల్ కూడా తమ విభాగాల్లో కాంస్యాలు సాధించి సత్తా చాటారు. ఈ పోటీలలో పది మంది బృందంతో బరిలో నిలిచిన భారత్.. ఆరు పతకాలతో సత్తా చాటడం విశేషం.