బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. పెర్త్ టెస్టులో మూడో రోజే గెలుపు బాటలు వేసుకున్న బుమ్రా సేన.. నాలుగో రోజు పెద్దగా కష్టపడకుండానే 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు నాలుగో రోజు క్రీజులోకి వచ్చిన కంగారూలు.. బుమ్రా నేతృత్వంలోని భారత పేస్ దళం దూకుడుకు తోకముడవక తప్పలేదు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఎదురుదాడికి దిగాలని చూసినా వాళ్ల పోరాటం భారత విజయాన్ని కాస్త ఆలస్యం చేసిందంతే. సిరాజ్, హర్షిత్, వాషింగ్టన్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
Team India | పెర్త్: ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. 534 పరుగుల భారీ ఛేదనలో ఆట నాలుగో రోజు ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అవడంతో 295 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పరుగుల పరంగా ఆస్ట్రేలియాలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. మూడోరోజే పెర్త్ టెస్టును తన నియంత్రణలోకి తెచ్చుకున్న బుమ్రా సేన.. నాలుగో రోజూ అదే జోరును కొనసాగించింది. సారథి జస్ప్రీత్ బుమ్రా (3/42), మహ్మద్ సిరాజ్ (3/51), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (2/48), హర్షిత్ రాణా (1/69) ధాటికి కంగారూలు తోక ముడవక తప్పలేదు. ట్రావిస్ హెడ్ (101 బంతుల్లో 89, 8 ఫోర్లు) ఎదురుదాడికి దిగినా అతడితో పాటు మిచెల్ మార్ష్ (47), అలెక్స్ కేరీ (36) పోరాటం భారత విజయాన్ని అడ్డుకోలేకపోయింది. మ్యాచ్‌లో బంతితో మెరిసిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టెస్టు వచ్చే నెల 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగనుంది.
ఓవర్ నైట్ స్కోరు 12/3తో నాలుగో రోజు ఆట ఆరంభించిన ఆసీస్‌ను హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఆరంభంలోనే కంగారెత్తించాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే మి యా.. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (4)ను బోల్తా కొట్టించాడు. సిరాజ్ బంతిని పుల్ షాట్ ఆడబోయిన ఖవాజా నియంత్రణ కోల్పోయి వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో స్మిత్ (17)కు హెడ్ జతకలిసి ఆసీస్ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. భారత బౌలర్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగిన హెడ్.. క్రీజులో కుదురుకున్న తర్వాత మరింత దూకుడు పెంచాడు. మరో ఎండ్‌లో స్మిత్ వికెట్ కాపాడుకునేందుకు యత్నించాడు. 60 బంతులెదుర్కున్న అతడు.. లంచ్ విరామానికి 5 ఓవర్ల ముందు సిరాజ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 62 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
స్మిత్ నిష్క్రమించినా మార్ష్ అండతో హెడ్ రెచ్చిపోయాడు. మార్ష్ కూడా దూకుడుగా ఆడటంతో ఆసీస్ స్కోరు వేగం పెరిగింది. లంచ్‌కు ముందే అర్ధ సెంచరీ పూర్తిచేసిన హెడ్ సెంచరీ దిశగా వేగంగా సాగాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని విడదీయడానికి స్వయంగా బుమ్రానే బరిలోకి దిగాడు. అతడు వేసిన 39వ ఓవర్లో హెడ్.. పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పరాజయం ఖరారైంది. ఆరో వికెట్‌కు హెడ్, మార్ష్ కలిసి 87 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. హెడ్ ఔట్ అయిన కొద్దిసేపటికి తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో మార్ష్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టీ విరామానికి ముందే స్టార్క్ (12)ను.. తర్వాత లయాన్‌ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‌కు పంపాడు. రాణా బౌలింగ్‌లో కేరీ క్లీన్‌బౌల్డ్ అవడంతో పెర్త్‌లో భారత్ విజయం సాధించింది.
8 టెస్టులు
40 వికెట్లు
18.80 సగటు
1950 తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టులు ఆడుతూ కనీసం 30 టెస్టు వికెట్లు తీసిన వంద మంది బౌలర్లలో కివీస్ దిగ్గజం సర్ రిచర్డ్ హ్యాడ్లీ (17.83) తర్వాత అత్యుత్తమ సగటు బుమ్రాదే.
1 ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో పరుగుల పరంగా భారత్‌కు పెర్త్ విజయమే అతిపెద్ద గెలుపు. మెల్బోర్న్ వేదికగా 1977లో 222, 2018లో 137 రన్స్ తేడాతో గతంలో గెలిచింది. ఓవరాల్‌గా ఆసీస్‌పై మోహాలీ (320) తర్వాత ఆ దేశంపై ఇది రెండో భారీ విజయం.
2 ఆసియా ఆవల భారత్‌కు ఇది రెండో (పరుగుల పరంగా) అతిపెద్ద విజయం. 2019లో విండీస్‌పై నార్త్‌సౌండ్‌లో 318 రన్స్ తేడాతో గెలవడమే ఇప్పటిదాకా అత్యుత్తమం.
పెర్త్‌లో ఆసీస్‌తో టెస్టు ఆడుతూ గెలిచిన రెండో ఆసియా సారథి బుమ్రా. తొలిస్థానం కుంబ్లేది.
4 టెస్టులలో భారత సారథుల అత్యుత్తమ ప్రదర్శనలలో బుమ్రాది (8/72) నాలుగో స్థానం. కపిల్ దేవ్ (10/135 వెస్టిండీస్‌పై), బిషన్ సింగ్ బేడి (10/194 ఆసీస్‌పై, 9/70 కివీస్‌పై) బుమ్రా కంటే ముందున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్; ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 487/6 డిక్లేర్డ్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 238 ఆలౌట్ (హెడ్ 89, మార్ష్ 47, బుమ్రా 3/42, సిరాజ్ 3/51)