సొంతగడ్డపై టీమ్ఇండియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కరీబియన్లు పట్టుదల కనబర్చుతున్నారు. తొలి మ్యాచ్‌లో విజయానికి చేరువైన విండీస్.. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగి మంచి స్కోరు చేసింది. అరంగేట్ర పేసర్ అవేశ్ ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. విండీస్ ఓపెనర్ షై హోప్ సెంచరీతో కదంతొక్కగా.. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఓపెనర్ షై హోప్ (115; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీ నమోదు చేసుకోవడంతో టీమ్ఇండియాతో రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. ఆదివారం పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (74; ఒక ఫోర్, 6 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించగా.. కైల్ మయేర్స్ (39), బ్రూక్స్ (35) రాణించారు. పూరన్ రెచ్చిపోవడంతో ఆఖరి 10 ఓవర్లలో విండీస్ 93 పరుగులు పిండుకుంది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్ర పేసర్ అవేశ్ ఖాన్ 6 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడగా.. 9.4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.
అవేశ్ అరంగేట్రం..
ఐపీఎల్లో సత్తాచాటి జాతీయ జట్టులోకి వచ్చిన యువ పేసర్ అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ధవన్ అతడికి జట్టు క్యాప్ అందించాడు.
భారత్‌కు జరిమానా
విండీస్‌తో తొలి వన్డేలో విజయం సాధించిన టీమ్ఇండియాపై జరిమానా పడింది. శుక్రవారం జరిగిన పోరులో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు భారత జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువ వేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.