పుణె : భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు వేదికైన పుణె స్టేడియంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. తమ అభిమాన క్రికెటర్లను ఆటను ఆస్వాదిద్దామనుకుని వచ్చిన ప్రేక్షకులకు పట్టపగలే నరకం కనిపించింది. ఓవైపు దంచికొడుతున్న ఎండకు బేజారైన ఫ్యాన్స్‌కు కనీసం త్రాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. స్టాండ్లకు పైకప్పు లేకపోవడంతో అభిమానులు ఎండకు విలవిలలాడాల్సి వచ్చింది. దీనిపై సోషల్‌మీడియాలో టీమ్ఇండియా ఫ్యాన్స్..మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ)తో పాటు బీసీసీఐ వైఖరిని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.