మ్యాచ్ చూసేందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా గుండెలోతుల్లో నుంచి మాట్లాడుతున్నాను. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు. – సునీల్ ఛెత్రి
Sunil Chhetri | కోల్‌కతా: సుదీర్ఘ భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న దిగ్గజ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. తన 19 ఏండ్ల ఫుట్‌బాల్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెడుతూ చెమర్చిన కండ్లతో మైదానాన్ని వీడాడు. గురువారం చారిత్రక సాల్ట్‌లేక్ స్టేడియం వేదికగా కువైట్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో సునీల్ బరిలోకి దిగాడు. విజయంతో తన అసమాన కెరీర్‌కు అద్భుతమైన ముగింపు పలుకుతాడనుకున్న ఛెత్రికి.. కువైట్‌తో పోరు 0-0తో డ్రా కావడం ఒకింత నిరాశ కల్గించింది.
తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బ్లూ టైగర్స్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. మ్యాచ్ జరుగుతున్న సేపు స్టేడియంలో ఉన్న 68,000 మంది ప్రేక్షకులు సునీల్..సునీల్..వందేమాతరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా స్లోగన్లు చేశారు. గత పోరులో కువైట్‌పై 1-0తో విజయం సాధించిన టీమ్ఇండియా..అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. 2005లో పాకిస్థాన్‌పై సునీల్ ఛెత్రి అరంగేట్రం మ్యాచ్ 1-1 డ్రా కాగా, ఆఖరి పోరు అదే విధంగా ముగియడం విశేషం.