రెండేండ్ల క్రితం డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియాకు ‘గద’ను దూరం చేసి.. ఏడాదిన్నర క్రితం వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా కప్పు కలను అడ్డుకున్న కంగారూలు మరోసారి రోహిత్ సేన ‘చాంపియన్స్’ ప్రయాణంలో ఎదురయ్యారు. 11 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా కల నెరవేరాలంటే ఆసీస్ అడ్డు తొలగించుకోవాల్సిందే..
Champions Trophy | దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఉన్న భారత జట్టు మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది. నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో రోహిత్ సేన.. అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఐసీసీ టోర్నీలలో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు అదే ఏడాది వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోనూ రోహిత్ సేనను ఓడించింది.
ఆ పరాభవాలకు దుబాయ్‌లో బదులు తీర్చుకోవడంతో పాటు చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ముందంజ వేయాలంటే మెన్ ఇన్ బ్లూ కంగారూల గండాన్ని దాటాల్సిందే. మ్యాచ్‌లో ఫేవరేట్‌గా భారత్ బరిలోకి దిగుతున్నా ఐసీసీ టోర్నీలలో మనపై ఆసీస్‌కు మెరుగైన రికార్డు ఉంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న దుబాయ్ పిచ్‌పై ఆసీస్ బ్యాటర్ల జోరుకు భారత స్పిన్ మాంత్రికుల మాయాజాలానికి రసవత్తర పోరు జరగడం ఖాయం!
దుబాయ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాల జోష్‌లో ఉన్న భారత్.. సెమీస్ పోరులోనూ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో నిరాశపరిచినా రోహిత్, కోహ్లీ, గిల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్లో శ్రేయాస్, అక్షర్, హార్దిక్, రాహుల్‌తో భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అంతగా అనుభవం లేని ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాకపోయినా స్పిన్నర్ జంపాను భారత బ్యాటర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి.
దుబాయ్ పిచ్ మ్యాచ్ మ్యాచ్‌కూ భిన్నంగా స్పందిస్తున్న వేళ.. తుది జట్టులో ఎవరిని ఆడిస్తారనేదీ ఆసక్తికరంగా మారింది. కివీస్‌తో మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. అదే ఫార్ములాతో ఆడే అవకాశాలుంటే రాణా బెంచ్‌కే పరిమితమవ్వొచ్చు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తిని ఆసీస్‌తో ఆడిస్తారా? లేదా? అనేది సస్పెన్సే.
పలు కారణాలతో ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, హెజిల్వుడ్, స్టార్క్ దూరమవడంతో ఆ జట్టు పేస్ విభాగం బలహీనంగా ఉంది. గత రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్‌పై (273) ఆ జట్టు బౌలర్లు తేలిపోయారు. కానీ భారత్ బెంగ అంతా ఒక్కడి పైనే. భారత్‌పై మ్యాచ్.. అదీ ఐసీసీ టోర్నీలంటేనే చెలరేగే ఆడే ట్రావిస్ హెడ్‌ను త్వరగా ఔట్ చేస్తేనే మ్యాచ్‌పై టీమ్ఇండియా పట్టుబిగించే అవకాశముంటుంది. ఏ క్షణంలో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం అతడి సొంతం. బౌలింగ్ బలహీనంగా ఉన్నప్పటికీ హెడ్, ఇంగ్లిస్, స్మిత్, లబూషేన్, మ్యాక్స్‌వెల్, క్యారీ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లతో ఆ జట్టు దుర్బేధ్యంగా ఉంది. మరి భారత స్పిన్నర్లు ఈ బ్యాటింగ్ లైనప్‌నకు ఎలా అడ్డుకట్ట వేస్తారనేది ఆసక్తికరం.