దుబాయ్: మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదో ట్రోఫీపై గురిపెట్టింది. మెగా టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరుకున్న హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని టీమిండియా ఆదివారం జరిగే తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఎడిషన్‌లో లంక చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోని ఎనిమిదోసారి విజేతగా నిలవాలని హర్మన్‌సేన కృతనిశ్చయంతో ఉంది. దుబాయ్ పిచ్‌లు మందకొడిగా, స్పిన్‌కు అనుకూలిస్తున్నప్పటికీ భారత ఓపెనర్ షెఫాలీ అద్భుత నిలకడ ప్రదర్శించింది. రెండు అర్ధశతకాలతో కలిపి 168 పరుగులు చేసిన ఆమె టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉంది.
మరో ఓపెనర్ స్మృతి మంధాన (154 పరుగులు) ఓ అద్భుత సెంచరీ బాదినప్పటికీ, మరో రెండు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. తుదిపోరులో మంధాన మళ్లీ తన మార్కు చూపెట్టాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ ప్రధాన ఆయుధంగా మారింది. 11 వికెట్లతో శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టుతో కలిసి అగ్రస్థానంలో ఉంది. అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ మెప్పిస్తోంది.
ఇక, పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తెలుగమ్మాయి శ్రీ చరణితో పాటు ప్రేమ రావత్ లయ అందుకోవడంతో స్పిన్ విభాగం బలంగా తయారైంది. అయితే, మిడిలార్డర్ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నారు. ప్రతీక, హర్మన్, రిచా ఆఖరాటలో అయినా మెప్పించాల్సి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్ జట్టును వేధిస్తోంది. టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో హర్మన్‌సేన ఏకంగా 9 క్యాచ్‌లు చేజార్చింది. ఈ సమస్య నుంచి భారత్ బయటపడాలి.
లంకేయులతో ముప్పే
రెండు జట్లూ టోర్నీలో అజేయంగా ఫైనల్‌కు చేరినప్పటికీ శ్రీలంకతో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. 2024లో దంబుల్లాలో జరిగిన తుదిపోరులో లంక 8 వికెట్ల తేడాతో హర్మన్‌సేనను చిత్తు చేసి ట్రోఫీ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో హర్షిత, ఆటపట్టు చెరో హాఫ్ సెంచరీతో లంకను గెలిపించారు. ఈసారి సెమీఫైనల్లోనూ పాకిస్థాన్‌పై శ్రీలంక అద్భుత పోరాటపటిమ ప్రదర్శించింది. 131 పరుగుల ఛేజింగ్‌లో ఒక దశలో 5/2, ఆ తర్వాత 33/4తో కష్టాల్లో పడినప్పటికీ అసాధారణంగా పోరాడింది. తీవ్ర ఒత్తిడిలో గొప్పగా ఆడి జట్టును గెలిపించిన హర్షిత, కవిష ఫైనల్లోనూ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో లంక బలంగా ఉంది. ఈ టోర్నీలో భారత స్పిన్నర్లు 26 వికెట్లు తీస్తే.. లంక స్పిన్నర్లు 25 పడగొట్టారు. దాంతో ఫైనల్లో ఇరు జట్ల స్పిన్ విభాగాలే కీలకం కానున్నాయి.