నిషిన్: ఆసియా క్రీడల టీ20 క్రికెట్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు సెమీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో భారత్.. 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యాటర్లకు సవాల్ విసిరిన పిచ్‌పై వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) వీరవిహారానికి తోడు వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 169/7 స్కోరు చేసింది.
లక్ష్యఛేదనలో లంకేయులు 9.5 ఓవర్లలో 45 రన్స్‌కే కుప్పకూలారు. నువానిదు ఫెర్నాండో (15) మినహా ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయాడు. భారత బౌలర్ల ధాటికి ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సున్నాలు చుట్టడం గమనార్హం. బుమ్రా (2/7), అక్షర్ పటేల్ (2/8), అభిషేక్ (2/2) దెబ్బకు టీ20ల్లో లంక తమ అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టుతోనే బరిలోకి దిగిన భారత టాపార్డర్ ద్వితీయశ్రేణి లంక బౌలింగ్‌కు కుదేలైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (7), సంజూ శాంసన్ (7)తో పాటు శ్రేయస్ (13) సైతం నిరాశపరిచారు. వర్షం కారణంగా బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై యువ సంచలనం వైభవ్ సైతం ఆరంభంలో భారీ షాట్లు ఆడలేకపోయాడు. అయితే నాలుగో ఓవర్ వేసిన బినురా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన అతడు.. తరిందు బౌలింగ్‌లో 4, 6, 4తో టచ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు.
కానీ పవర్ ప్లే తర్వాత సహాన్ బౌలింగ్‌లో సినెత్ చేతికి చిక్కాడు. భారత స్కోరు 59/3 వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన ఇషాన్.. దూకుడుగా ఆడుతూ సిక్స్‌లతో లంక బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. శ్రేయస్, అక్షర్ (8), తిలక్ (2) ఇలా సహచరులంతా వెనుదిరిగినా 17వ ఓవర్లో తొలి బంతిని లాంగాఫ్ మీదుగా సిక్స్ కొట్టడంతో అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. దూబే (3) కూడా ధాటిగా ఆడలేకపోయాడు. ఆఖరి ఓవర్లో ఇషాన్, వాషింగ్టన్ (7*) 18 రన్స్ రాబట్టడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
గెలుపుపై నమ్మకం లేకున్నా అంతగా అనుభవం లేని లంక ఓటమి పవర్ ప్లేలోనే ఖాయమైంది. తొలి ఓవర్లోనే బుమ్రా రెండు వికెట్లు తీసి వికెట్ల వేటను ఆరంభిస్తే అక్షర్, వాషింగ్టన్ స్పిన్ మాయతో 6 ఓవర్లకే ఆ జట్టు 33/6తో నిలిచింది. అభిషేక్ వేసిన పదో ఓవర్లో తరిందు రనౌట్ అవగా చమిక, బినురా కూడా సహచరులను అనుసరించడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు.
సెమీస్ విజయంతో శ్రేయస్ సేన ఫైనల్లో పాకిస్థాన్‌తో పసిడి పోరుకు సిద్ధమైంది. తొలి సెమీస్‌లో పాక్.. 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన మ్యాచ్‌లో మొదట బంగ్లా 111/7 స్కోరు చేయగా లక్ష్యాన్ని పాక్ 11.3 ఓవర్లలో దంచేసింది. శనివారం భారత్, పాక్ ఫైనల్ ఆడతాయి.