Women’s World Cup | ఐసీసీ వన్డే వుమెన్స్ వరల్డ్ కప్‌కు భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. భారత్-శ్రీలంక మధ్య మంగళవారం తొలి మ్యాచ్ జరిగింది. ఈ ప్రారంభ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 23వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఇది ఐసీసీ మహిళల టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్‌లో రికార్డు కావడం విశేషం. మంగళవారం జరిగిన మ్యాచ్‌ను 22,843 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. గతేడాది దుబాయిలో జరిగిన వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు 15,935 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తాజాగా ఐసీసీ వుమెన్స్ ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ 22,843 మంది హాజరయ్యారని.. ఇది ఐసీసీ వుమెన్స్ టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్‌లో రికార్డని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీ గ్రాండ్‌గా ప్రారంభించింది.
దీప్తి శర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించింది. దీప్తి, అమంజోత్ కౌర్ అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 269 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. దీప్తి బ్యాట్‌తో పాటు బంతితో అద్భుతంగా రాణించింది. మూడు వికెట్లు పడగొట్టింది. శ్రీలంక తరఫున 43 పరుగులతో చమరి అటపట్టు టాప్ స్కోరర్‌గా నిలిచింది. నీలాక్షి డిసిల్వా 35, హర్షిత సమరవిక్రమ 29, అచ్చిని కులసూర్య 17 పరుగులు చేశారు. దీప్తి మూడు వికెట్ల పడగొట్టగా.. స్నేహ రాణా, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, ప్రతీకా రావల్‌కు చెరో వికెట్ దక్కింది.