న్యూఢిల్లీ : మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్ చేరలేకపోయినప్పటికీ భారత్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వందేండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తున్నవేళ విశ్వక్రీడల కోసం అర్హత నిబంధనలను ఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు చొప్పున జట్లు మాత్రమే ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నాయి. పురుషుల విభాగంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత కల్పిస్తుండగా, మహిళల్లో ప్రస్తుతం ఇంగ్ల్లండ్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగా స్థానాలను కేటాయించనున్నారు.
దీని ప్రకారం టీ20 ప్రపంచకప్‌లో నాలుగు ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్ (ఆసియా), ఆస్ట్రేలియా (ఓషియానియా), సౌతాఫ్రికా (ఆఫ్రికా), ఇంగ్లండ్ (యూరప్) ఇప్పటికే అర్హత సాధించాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పురుషుల టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్-4లో నిలిచిన జట్లు క్వాలిఫై అవుతాయి. ఈ నిబంధన ప్రకారం టీమిండియా నేరుగా అర్హత సాధించాలంటే 2026ని ఆసియా ఖండంలో టాప్ ర్యాంకర్‌గా ముగించాలి. మరోవైపు ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా పురుషుల, మహిళల జట్లకు ఒలింపిక్స్‌లో నేరుగా ఒక స్థానం లభిస్తుంది. అయితే క్వాలిఫికేషన్ కాలంలో ఆ జట్లు ఐసీసీ ర్యాంకుల్లో టాప్-15లో నిలవాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది.