ఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగాల్లో భారత ఆశలు మోస్తున్న పీవీ సింధు, కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్-చిరాగ్ ద్వయం తమ జోరును కొనసాగిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లగా సింధు, జార్జి ఓటములు పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
ఏకంగా 21 మందితో ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత్ తరఫున ఇక మిగిలింది సాత్విక్ జోడీనే కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ పోరులో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-10, 21-17తో జిన్ యంగ్-కంగ్ మిన్ హ్యుక్ (దక్షిణ కొరియా) జంటను చిత్తుచేసింది. పెండ్లి తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న సింధు 9-21, 21-19, 17-21తో జార్జియానా మరిస్క (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి 13-21, 19-21తో వెంగ్ హాంగ్యంగ్ (చైనా)కు తలవంచాడు.