మస్కట్, డిసెంబర్ 18: భారత్, ఒమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల ఒమన్ పర్యటనలో భాగంగా గురువారం ఇక్కడ ఇరు దేశాల వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాల నేపథ్యంలో దీన్ని గొప్ప ఊరటగానే కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ డీల్‌కు సహకరించిన ఒమన్ సుల్తాన్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల పరస్పర వృద్ధికి సీఈపీఏ దోహదం చేయగలదని, ద్వైపాక్షిక వాణిజ్యానికి ఓ చోదక శక్తిగా మారగలదని అన్నారు. ఇదిలావుంటే ఈ సందర్భంగా మోదీని ఒమన్ తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో గౌరవించింది.
ఈ ట్రేడ్ డీల్‌తో భారత్ నుంచి ఒమన్‌కు ఎగుమతి అవుతున్న 99.38 శాతం వస్తూత్పత్తులపై సుంకాలు తొలగిపోనున్నాయి. ఫలితంగా రత్నాలు-ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా-ఇంజినీరింగ్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్ తదితర రంగాలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం చెప్తున్నది.
ప్రస్తుతం వీటన్నిటిపై ఒమన్‌లో 5 నుంచి 100 శాతం మేర సుంకాలు పడుతున్నాయి. మరోవైపు ఒమన్ నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వాటిలో 94.81 శాతం వస్తూత్పత్తులపై ఈ డీల్ నేపథ్యంలో సుంకాల రాయితీ ఉండనున్నది. ఈ క్రమంలో భారత్-ఒమన్ ట్రేడ్ డీల్‌పై దేశీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
భారత్, ఒమన్ మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశీయ ఎగుమతు లు పెరిగేందుకు ఆస్కారమున్నది. సుంకాల మినహాయింపు ఇరు దేశాల్లోని ఆయా రంగాలకు లాభిస్తుంది. తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం బలపడుతుంది. ముఖ్యంగా భారతీయ రత్నాలు-ఆభరణాల రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీలకు ఈ ట్రేడ్ డీల్‌తో ప్రయోజనాలు చేకూరుతాయి.
-దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘాలు