Davis Cup 2024 : డేవిస్ కప్‌లో భారత జట్టు రాత మారలేదు. వరుసగా ఆరోసారి స్వీడన్(Sweden) చేతిలో పరాజయం పాలైంది. వరల్డ్ గ్రూప్ 1లో భాగంగా ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో ఎన్ శ్రీరామ్ బాలాజీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు చేతులెత్తేశారు. అనంతరం సిద్ధార్థ్ విశ్వకర్మ(Sidhartha Vishwakarma) సైతం ఎలియాస్ ఎమరె ధాటికి నిలవులేకపోయాడు. దాంతో, భారత్ 4-0తో స్వీడన్ చేతిలో ఓడిపోయింది. తద్వారా మెగా టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న స్వీడన్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.
భారీ అంచనాలతో డేవిస్ కప్ బరిలోకి దిగిన భారత డబుల్స్ జోడికి స్వీడన్ ద్వయం చెక్ పెట్టింది. మొదట్లోశ్రీరామ్ బాలాజీ, రమనాథన్లు అద్భుతంగా ఆడారు. అయితే.. ఫిలిప్ బెర్గెవి, అండ్రే గొరాన్స్సన్ల జోరుకు తలొగ్గి టై బ్రేక్ కోల్పోయారు. చివరకు 3-6, 4-6తో పరాజయం పాలయ్యారు. ఇక సింగిల్స్‌లో సిద్ధార్థ్ విశ్వకర్మ కనీస పోరాటం చేయలేదు. ఎలియాస్ చెలరేగడంతో భారత ఆటగాడు 2-6, 2-6తో చేతులెత్తేశాడు. దాంతో భారత బృందం వచ్చే ఏడాది జరుగబోయే వరల్డ్ గ్రూప్ 1 ప్లే ఆఫ్స్‌లో ఆడనుంది.