సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో అభిమానులకు మరో చేదు గుళిక. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. అప్రతిహత విజయాలతో దశాబ్ద కాలంగా తమ వద్దే అట్టిపెట్టుకున్న ట్రోఫీని ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఆస్ట్రేలియాను ముచ్చటగా మూడోసారి వారి సొంతగడ్డపై మట్టికరిపించి హ్యాట్రిక్ కొడుదామనుకున్న టీమ్ఇండియా ఆశలు అడిఆశలయ్యాయి. బ్యాటింగ్ వైఫల్యంతో 1-3తో సిరీస్ కోల్పోయిన భారత్ సిడ్నీ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బోలాండ్ ఆరు వికెట్ల ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే పరిమితమైన టీమ్ఇండియా.. ఆసీస్‌ను కట్టడి చేయలేక ఓటమి మూటగట్టుకుంది. దీంతో డబ్ల్యూటీసీ బెర్తు కూడా గల్లంతై ఉత్తచేతులతో స్వదేశానికి పయనమైంది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్(బీజీటీ) సిరీస్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. పెర్త్ టెస్టులో విజయం మినహాయించి ఆస్ట్రేలియాకు దీటైన పోటీనివ్వలేకపోయిన భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3తో చేజార్చుకుంది. 1-0 ఆధిక్యంతో సిరీస్‌ను మొదలుపెట్టిన భారత్ అదే ఒరవడి కొనసాగించలేకపోయింది. దీంతో 2014-15 తర్వాత టీమ్ఇండియా బీజీటీ సిరీస్‌ను తొలిసారి ఆసీస్‌కు చేజార్చుకుంది. ముచ్చటగా మూడు రోజుల్లో ముగిసిన సిడ్నీ టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. టీమ్ఇండియా నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉస్మాన్ ఖవాజ(41), వెబ్‌స్టర్(39 నాటౌట్), హెడ్(34 నాటౌట్) రాణించారు. ప్రసిద్ధ్ కృష్ణ(3/65) ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 141/6తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ 157 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ బోలాండ్(6/45) ఆరు వికెట్లతో టీమ్ఇండియా పతనాన్ని శాసించాడు. పంత్(61) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతావారు విఫలమయ్యారు. బోలాండ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, 32 వికెట్లు తీసి భారత్‌ను ఒంటిచేత్తో నడిపించిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.
ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను బోలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. సిడ్నీ పిచ్‌పై సూపర్ స్వింగ్‌తో చెలరేగిన బోలాండ్..టీమ్ఇండియా ఆఖరి వరుస బ్యాటర్లను గడగడలాడించాడు. అప్పటికే నాలుగు వికెట్లతో జోరుమీద కనపించిన బోలాండ్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు జడేజా (13), సుందర్ (12) నిలదొక్కుకోలేకపోగా, సిరాజ్ (4), బుమ్రా(0), ప్రసిద్ధ్ కృష్ణ(1 నాటౌట్) ఇలా వచ్చి అలా వెళ్లారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు బోలాండ్ స్వింగ్‌తో చెలరేగడంతో భారత బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. సిరీస్‌లో ఏకంగా ఎనిమిదోసారి కోహ్లీ ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతులు ఆడి ఔట్ కాగా, బ్యాటర్లు నిలకడ ప్రదర్శించలేకపోయారు. బోలాండ్కు తోడు కమిన్స్(3/44) రాణించడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు.
నిర్దేశిత లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్న వేళ ఆసీస్ బ్యాటర్లు ఆది నుంచే భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. తాత్కాలిక కెప్టెన్, సూపర్ ఫామ్‌మీదున్న బుమ్రా గాయం కారణంగా బౌలింగ్‌కు రాకపోవడం ఆసీస్ గెలుపు అవకాశాలను పెంచింది. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తమదైన రీతిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాన్స్టాస్(22), లబుషేన్(6), స్మిత్(4)ను ప్రసిద్ధ్ పెవిలియన్ పంపాడు. అయితే సిరీస్‌లో తొలిసారి ఖవాజ ఫామ్ ప్రదర్శించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో హెడ్, వెబ్‌స్టర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. పసలేని భారత బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించడంతో లక్ష్యం అంతకంతకు కరుగుతూ పోయింది. స్టాండింగ్ కెప్టెన్ కోహ్లీ..ఉన్న వనరులను మార్చిమార్చి ప్రయోగించినా ఆసీస్‌ను నిలువరించలేకపోయారు.
టెస్టు క్రికెట్ పట్ల అంకితభావమున్న ప్రతీ ఒక్కరు దేశవాళీలో ఆడాల్సిందే. జట్టుకు ఆడాలనుకున్న అందరికీ ఇది వర్తిస్తుంది. ఐదు నెలల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే నేను ఏం చెప్పలేను. జట్టు గెలువాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఏం జరుగుతుందో వేచిచూద్దాం. ఇప్పటి వరకు జరిగింది భారత క్రికెట్ బాగుకోసమే. ప్రతీ ఒక్కరు దేశవాళీల్లో ఆడాలి. ఒక మ్యాచ్‌కే పరిమితం కాకుండా అన్నీ మ్యాచ్‌లు ఆడాలి. దేశవాళీకి ప్రాధాన్యమివ్వకపోతే టెస్టు క్రికెట్లో సరైన ప్లేయర్లకు చాన్స్ దొరకదు. ఏ ఒక్క ప్లేయర్ భవిష్యత్ గురించి నేను మాట్లాడను.
1 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడం గత 10 ఏండ్లలో భారత్‌కు ఇది తొలిసారి.
2 గంభీర్ కోచింగ్‌లో భారత్ వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 185 ఆలౌట్,
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్,
భారత్ రెండో ఇన్నింగ్: 157 ఆలౌట్ (పంత్ 61, జైస్వాల్ 22, బోలాండ్ 6/45, కమిన్స్ 3/44),
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 27 ఓవర్లలో 162/4(ఖవాజ 41, వెబ్‌స్టర్ 39 నాటౌట్, ప్రసిద్ద్ కృష్ణ 3/65)