India – Japan : ఆసియా క్రీడల సన్నద్ధతలో ఉన్న భారత పురుషుల జట్టు అంతకంటే ముందే జపాన్(Japan)తో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇండియా, జపాన్ మధ్య దౌత్య బంధానికి ప్రతీకగా ఇరుదేశాల జట్లు పొట్టి ఫార్మాట్లో తలపడనున్నాయి. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లు కావొస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పునస్కరించుకొని.. ఏకైక టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) వెల్లడించింది.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులకోసం ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా ‘స్పోర్ట్స్ 75’తో తొలి అడుగు వేయనుంది. ఇండియా, జపాన్ మధ్య క్రీడల్లో పరస్పర సహకారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని సనే తకైచీలు మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగానే భారత్, జపాన్ ద్వైపాక్షిక బంధానికి 75 ఏళ్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ ఖరారైంది.
ఈ అంశంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా(Devjit Saikia) మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మక సందర్భంలో భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జపాన్ వేదికగా ఇండియా, జపాన్ పురుషుల జట్లు ఏకైక టీ20 ఆడనున్నాయి. ప్రపంచ క్రికెట్లో ఇది చాలా ప్రధానమైనది. జపాన్, తూర్పు ఆసియాలో క్రికెట్ వ్యాప్తికోసం ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది’ అని వెల్లడించాడు.
The BCCI believes that the growth of cricket must extend beyond its traditional territories, and we recognise our responsibility to contribute to that growth: Mr Devajit Saikia (@lonsaikia), Honorary Secretary, BCCI @CricketJapan pic.twitter.com/Fs1i4kkRT7
— BCCI (@BCCI) September 4, 2026
‘భారత్, జపాన్ మధ్య సుదీర్ఘ అనుబంధం, స్నేహం ఉంది. ఇరుదేశాల 75 ఏళ్ల దౌత్య అనుబంధ వేడుకల్లో క్రికెట్ భాగం కానుంది. ఏకైక టీ20 సాధ్యపడేందుకు కృషి చేసిన జపాన్ క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు. ఆ దేశంలో క్రికెట్ పురోగతికోసం జేసీఏతో కలిసి బీసీసీఐ చర్యలు తీసుకోనుంది’ అని సైకియా పేర్కొన్నాడు.
𝗛𝗶𝘀𝘁𝗼𝗿𝘆 𝗜𝗻 𝗧𝗵𝗲 𝗠𝗮𝗸𝗶𝗻𝗴!
India🇮🇳 🤝 Japan🇯🇵#TeamIndia set to play a historic T20I against Japan to launch the celebrations of the 7️⃣5️⃣th Anniversary of India-Japan Diplomatic Relations. 👏👏@CricketJapan
All The Details 🔽https://t.co/vxdhuT1tgp pic.twitter.com/DQmPncvefH
— BCCI (@BCCI) September 4, 2026
జేసీఏ సీఈవో నవోకి మియాజి మాట్లాడుతూ.. ‘వరల్డ్ ఛాంపియన్‌ను మా దేశానికి ఆహ్వానించడం మా క్రికెట్ సంఘానికి చరిత్రాత్మకమైన సందర్భం. టీ20 నిర్వహణ కోసం మాతో కలిసి పని చేస్తున్న బీసీసీఐకి కృతజ్ఞతలు. ఇరుదేశాల 75 ఏళ్ల దౌత్య అనుబంధ వేడుకల్లో ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే భారత, క్రికెట్ అభిమానులకు ఆత్మీయ స్వాగతం పలుకుతాం’ అని పేర్కొన్నాడు. తొచిగిలోని సాంటో ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో సెప్టెంబర్ 22వ తేదీన ఏకైక టీ20 మ్యాచ్ ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.