ఒలింపిక్స్‌లో మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర కలిగి పునర్వైభవం దిశగా సాగుతున్న భారత హాకీ జట్టు ‘పారిస్’లో సంచలన విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో అదరగొట్టి క్వార్టర్స్ చేరిన ‘మెన్ ఇన్ బ్లూ’.. ప్రపంచ రెండో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన క్వార్టర్స్ పోరులో నిర్దేశిత సమయానికి ఇరు జట్లూ చెరో గోల్‌తో సమానంగా ఉన్నా ‘పెనాల్టీ షూటౌట్’ ద్వారా తేలిన ఫలితంలో భారత్ అద్భుతమే చేసింది. ‘డూ ఆర్ డై’ పరిస్థితుల్లో మనోళ్లు 4 గోల్స్ కొట్టగా ప్రత్యర్థి జట్టు రెండింటికే పరిమితమైంది. గోల్ పోస్ట్ వద్ద పీఆర్ శ్రీజేష్ గోడ కట్టడంతో బ్రిటన్‌కు నిరాశ తప్పలేదు. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో సెమీస్. టోక్యోలో మన కుర్రాళ్లు కాంస్య పతకాన్ని పట్టుకొచ్చిన విషయం విదితమే.
Indian Hockey | పారిస్: ‘టోక్యో’లో వచ్చిన కాంస్య పతకం రంగు మార్చాలని పట్టుదలతో ఉన్న భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌లో ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్ 1-1 (4-2)తో గ్రేట్ బ్రిటన్ను ఓడించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆటలో నిర్దేశిత సమయానికి ఇరు జట్లూ తలా ఒక గోల్ చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. షూటౌట్లో భారత్ 4 గోల్స్ చేయగా బ్రిటన్ రెండు మాత్రమే చేయగలిగింది. ఈ టోర్నీలో అత్యద్భుతమైన ఫామ్‌తో రెచ్చిపోతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి రెండు గోల్స్‌తో సత్తా చాటాడు. ఇక బ్రిటన్ ఆటగాళ్ల గోల్ లక్ష్యాలను పదేపదే అడ్డుకుని వారికి ‘అడ్డుగోడ’లా నిలబడ్డ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పోరాటం అయితే నభూతో నభవిష్యత్! క్వార్టర్స్‌లో గెలిచిన భారత్.. జర్మనీ-అర్జెంటీనా మధ్య జరిగే క్వార్టర్స్ పోరులో విజేతతో మంగళవారం సెమీస్‌లో తలపడనుంది.
తొలి క్వార్టర్లో ఐదు నిమిషాల వ్యవధిలోనే బ్రిటన్‌కు రెండుసార్లు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా వాటిని శ్రీజేష్ అడ్డుకున్నాడు. భారత్ కూడా మొదటి 15 నిమిషాల్లో 3 సార్లు వాటిని చేజార్చుకుంది. రెండో క్వార్టర్ మొదలైన రెండు నిమిషాలకే భారత డిఫెండర్ అమిత్ రోహిత్దాస్కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైన విలియమ్ కల్నల్ తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని ఆరోపిస్తూ రిఫరీలు అతడిని బయటకు పంపించడంతో హర్మన్‌ప్రీత్ సేన మిగిలిన మ్యాచ్‌ను 10 మందితోనే ఆడింది. కీలక ఆటగాడు ఫీల్డ్‌లో లేకున్నా భారత్ నిరాశచెందలేదు. మూడో క్వార్టర్లో సుమిత్ కూడా గ్రీన్ కార్డ్ కారణంగా కొంతసేపు మైదానాన్ని వీడటం గమనార్హం. 22వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ బోణీ కొట్టింది. అయితే రెండో క్వార్టర్ ముగియకుమందే 27వ నిమిషంలో లీ మోర్టన్ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. తర్వాత రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది.
షూటౌట్లో బ్రిటన్ తరఫున అల్బరి జేమ్స్, వాలేస్ జాక్ రెండు గోల్స్ కొట్టారు. భారత్ నుంచి హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ గోల్స్ చేసి స్కోర్లను సమం చేశారు. మూడో గోల్ కోసం వచ్చిన విలియమ్సన్ కానర్ ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకోవడంతో ఆ జట్టులో టెన్షన్ మొదలైంది. లలిత్ ఉపాధ్యాయ మూడో గోల్ చేసి భారత్‌ను 3-2తో ఆధిక్యంలోకి తెచ్చాడు. బ్రిటన్‌కు చివరి అవకాశంగా వచ్చిన రోపర్ ఫిలిప్ సైతం గోల్ చేయడంలో విఫలమయ్యాడు. కానీ రాజ్‌కుమార్ పాల్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు.
తన సుదీర్ఘ కెరీర్లో భారత్ తరఫున చివరి టోర్నీ ఆడుతున్న దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేష్ మరోసారి భారత్‌కు హీరో అయ్యాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ భారత డిఫెండర్లను దాటుకుని వచ్చిన బ్రిటన్ గోల్ ప్రయత్నాలను 36 ఏండ్ల శ్రీజేష్ విజయవంతంగా అడ్డుకున్నాడు. తొలి క్వార్టర్ 11వ నిమిషంలో సామ్యూల్ వార్డ్ పెనాల్టీ కార్నర్ ఆశలపై అతడు నీళ్లుచల్లాడు. ఇక రోహిత్‌దాస్ ఫీల్డ్ నుంచి వెళ్లాక అతడి బాధ్యతనూ తనే తీసుకున్నాడు. 32వ నిమిషంలో రూపర్ట్ షిప్పరీ కొట్టిన బంతిని కళ్లు చెదిరే రీతిలో ఆపాడు. ఆట మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా 56వ నిమిషంలో మన డిఫెండర్లను చాకచక్యంగా తప్పించుకుని గోల్ పోస్ట్ దిశగా కదిలిన కల్నన్ ఆటలూ సాగనివ్వలేదు. ఇక షూటౌట్లో తొలి రెండు గోల్స్ మిస్ అయినా తర్వాత రెండింటినీ విజయవంతంగా అడ్డుకుని భారత్‌ను సెమీస్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
నేను మైదానంలోకి దిగాక నా ముందు రెండే ఆప్షన్స్ కనబడ్డాయి. ఒకవేళ ఓడితే ఇదే నా చివరి మ్యాచ్. గెలిస్తే మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. అమిత్ ఫీల్డ్ నుంచి వెళ్లగానే అతడి బాధ్యతలూ నేనే తీసుకున్నా. అతడు మా జట్టుకు ఆస్తి. ఇది జట్టు విజయం. నాకు మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. సెమీస్‌లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తాం
– పీఆర్ శ్రీజేష్