బుసాన్(కొరియా): సంప్రదాయక గ్రామీణ క్రీడ కబడ్డీపై భారత్ మరోమారు తన పట్టు నిరూపించుకుంది. తమకు తిరుగులేదన్న రీతిలో చెలరేగుతూ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలకు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేకూరుస్తూ ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. శుక్రవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 42-32 తేడాతో ఇరాన్‌పై అద్భుత విజయం సాధించింది. ఉపఖండ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం.
మ్యాచ్ విషయానికొస్తే ఆది నుంచే ఇరాన్ దూకుడు ప్రదర్శించగా, భారత్ తన అనుభవాన్ని ఉపయోగిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. కెప్టెన్ పవన్ షెరావత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తూ ఇరాన్‌ను ఆలౌట్ చేయడంతో భారత్‌కు 10-4 ఆధిక్యం దక్కింది. అదే ఒత్తిడిని కొనసాగిస్తూ వచ్చిన టీమ్ఇండియా..మరోమారు ఇరాన్‌ను ఆలౌట్ చేయడం ద్వారా తమ ఆధిక్యాన్ని 23-11కు పెంచుకుంది. అయితే ఆల్‌రౌండర్ మహమ్మద్రెజా చియాన్…ఇరాన్‌ను తిరిగి పోటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఏ దశలోనూ వెనుకకు తగ్గని భారత్ అటు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ 33-14 స్కోరు జోరు పెంచింది. ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు సాయ్ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. చివరిసారి ఇరాన్లో 2017లో జరిగిన టోర్నీలో దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేస్తూ భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.