
న్యూఢిల్లీ: షూటింగ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. మొత్తం 43 పతకాలతో టోర్నీకి ఘనంగా వీడ్కోలు పలికారు. పెరూలోని లిమా వేదికగా జరిగిన టోర్నీకి సంబంధించిన పతకాలపై భారత రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) సోమవారం స్పష్టత ఇచ్చింది. 17 స్వర్ణాలు సహా 16 రజత, 10 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ప్రకటించింది. పోటీలకు ఆఖరి రోజైన ఆదివారం ఏకంగా 12 పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించారు. పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో విజయ్‌వీర్ సిద్ధు స్వర్ణంతో మెరువగా అతని సోదరుడు ఉదయ్‌వీర్‌కు రజతం, హర్ష్ గుప్తా కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల జూనియర్ 25మీటర్ల పిస్టల్ తుదిపోరులో రిథమ్ సాంగ్వాన్ పసిడి పతకంతో ఆకట్టుకోగా, నివేదిత వెలూరు నాయర్(565) రజతంతో ఆకట్టుకోగా, నామ్య కపూర్ కాంస్యం ఖాతాలో వేసుకుంది. పురుషుల జూనియర్ 50మీటర్ల ఫైనల్లో అర్జున్‌సింగ్ చీమా(స్వర్ణం), శౌర్యసరిన్, అజింక్యా చవాన్ వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల జూనియర్ 50మీటర్ల పిస్టల్ ఈవెంటులో శిఖా నార్వల్(530) పసిడి పతకంతో మెరువగా, హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్(529)కు రజతం, నవ్దీప్కౌర్(526)కు కాంస్య పతకం దక్కించుకున్నారు. మెగా టోర్నీలో ఇషాసింగ్‌కు ఇది రెండో రజతం కావడం విశేషం. మొత్తంగా 43 పతకాల్లో పిస్టల్ విభాగంలో 26 పతకాలు రాగా, షాట్‌గన్‌లో తొమ్మిది, రైఫిల్‌లో ఎనిమిది పతకాలు లభించాయి. షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన వారిని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు.