ఢిల్లీ : వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ప్రశంసలు కురిపించాడు. సొంతగడ్డపై భారత జట్టు ఎంతో ప్రమాదకారని, ఈసారి ఫేవరెట్ టీమ్ఇండియానే వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని టేలర్ అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో భారత జట్టు ఆకలిగొన్న సింహంలా ఆడుతుంది. ఊహించినట్టుగానే మెగా టోర్నీని టీమ్ఇండియా అద్భుతంగా ఆరంభించింది.
ప్రస్తుతం రోహిత్ సేన జోరు చూస్తుంటే.. ధర్మశాలలో ఏం జరుగుతుంది? అనేదానితో సంబంధం లేకుండా టైటిల్ ఫేవరెట్ భారత జట్టే అనిపిస్తోంది అని టేలర్ తన ఐసీసీ కాలమ్లో పేర్కొన్నాడు. అంతేకాదు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దాడికి గొప్పగా నాయకత్వం వహించాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. పైగా.. భారత టాప్ -3 బ్యాటర్లు కొంతకాలంగా అత్యద్భుతంగా రాణిస్తున్నారు అని టేలర్ అన్నాడు.