ఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో రెండోరోజూ భారత్ పతకాల వేట కొనసాగించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో 16 ఏండ్ల కుర్రాడు జొనాథన్ గావిన్ అంథోని స్వర్ణం గెలిచాడు.క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన జొనాథన్.. 244.8 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో భారత్కు ఇది రెండో స్వర్ణం.
24 షాట్లలో అతడు ఏకంగా 21 షాట్లు పదికి పది పాయింట్లు సాధించడం విశేషం. ఇటలీకి చెందిన లుకా అరిఘి (236.3) రజతం గెలుచుకోగా, స్పెయిన్ షూటర్ లుకాస్ సాంచెజ్ (215.1) కాంస్యం సాధించాడు. జూనియర్ ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్లో భారత అమ్మాయి రష్మిక సెహ్గల్ (236.1) రెండో స్థానంలో నిలిచి సిల్వర్ నెగ్గింది. తటస్థ క్రీడాకారిణి ఎవ్లీనా షీనా (240.9) గోల్డ్ గెలుచుకోగా ఫతెమా షెకారి (ఇరాన్-213.8) కాంస్యం నెగ్గింది.