Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను నియమించారు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20 జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. అయితే, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా సీనియర్ రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్‌కు అప్పగించింది. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మళ్లీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా తిరిగి జట్టులో చేరుతాడని భావించగా.. సెలక్షన్ కమిటీ కెప్టెన్సీని గిల్‌కు అప్పగించింది. ఇది అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే రోహిత్‌కు జట్టులో చోటు కల్పించింది. అయితే, కెప్టెన్ బాధ్యతలను గిల్‌కు ఎందుకు అప్పగించారో సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాకు తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే జట్టులో రోహిత్‌తో పాటు కోహ్లీకి సైతం బీసీసీఐ చోటు కల్పించింది. చివరగా ఇద్దరు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున ఆడారు. ఇద్దరు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టు ఇక గిల్ కెప్టెన్సీలోనే ఆడనున్నది.
జట్టును ప్రకటించిన తర్వాత అగార్కర్ విలేకరుల సమావేశం నిర్వహించి గిల్‌కు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారో క్లారిటీ ఇచ్చాడు. 2027 వన్డే ప్రపంచ కప్ మాత్రమే కాకుండా టీమిండియా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కెప్టెన్సీ ఇచ్చినట్లు అగార్కర్ తెలిపాడు. గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి అన్ని ఫార్మాట్లలో స్థిరత్వాన్ని కొనసాగించడం, ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను కలిగి ఉండకపోవడమని అగార్కర్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండడం ఆచరణాత్మకంగా అసాధ్యమని.. ఏదో ఒక సమయంలో తాము రాబోయే ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కావాలని.. తర్వాత కెప్టెన్‌కు సిద్ధమయ్యేందుకు కనీసం కొంత సమయం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ చీఫ్ చెప్పాడు. ప్రస్తుతం ఎక్కువ వన్డే మ్యాచ్‌లు లేవని.. వన్డే ప్రపంచ కప్‌కు దగ్గరగా వచ్చే కొద్దీ, బహుశా మరిన్ని మ్యాచ్‌లు ఉండవచ్చని తెలిపాడు. భారత వన్డే జట్టు కూడా మార్పు దశలో ఉందని.. రోహిత్, కోహ్లీ ఇప్పుడు జట్టులో బ్యాట్స్‌మన్ బాధ్యతలో ఉంటారని.. ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ తమ కెరీర్లో చేసినట్లుగానే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు అగార్కర్ చెప్పుకొచ్చాడు.
రోహిత్, కోహ్లీ ఏళ్లుగా పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని తాను అనుకోనని.. ఇప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరు నాయకులేనని.. చాలా పరుగులు సాధించారని.. ఇకపై అలాగే రాణిస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈ ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చివరి వన్డే సిరీస్ అవుతుందా? అని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు అగార్కర్ నిరాకరించాడు. ఇటీవల ఫిట్నెస్ పరీక్షల తర్వాత ఇద్దరూ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారని.. అవసరమైన ప్రమాణాలను చేరుకున్నారని తాను విశ్వసిస్తున్నానని చెప్పాడు. తనకు తెలిసినంతవరకు.. సెలెక్టర్ల విషయానికొస్తే వారు అవసరమైన అన్ని ప్రమాణాలను చేరుకున్నారని.. సాధారణంగా జట్టు ఎంపికకు ముందు తాము పేర్లను సీఓఈకి పంపిస్తామని.. ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ అధికారికంగా ఫిట్‌గా ఉన్నట్లుగా నిర్ధారించుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌లో లేడని, అందుకే ఆస్ట్రేలియా పర్యటనకు పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలిపాడు. ఆసియా కప్ ఫైనల్‌కు ముందు హార్దిక్ గాయపడ్డ విషయం తెలిసిందే. దాంతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.