Paris Olympics | విల్లెపింటె (నార్త్ పారిస్ ఎరీనా): ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకాలు వస్తాయని ఆశించిన బాక్సింగ్ క్రీడాంశంలోనూ భారత్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. టోక్యోలో కాంస్యం గెలిచిన అసోం అమ్మాయి లవ్లీనా బొర్గొహెయిన్.. ఆదివారం జరిగిన మహిళల 75 కిలోల క్వార్టర్స్‌లో 1-4తో లి క్వియాన్ (చైనా) చేతిలో ఓడింది. దీంతో బాక్సింగ్‌లో భారత్ ప్రయాణం ముగిసినైట్టెంది. నిఖత్ జరీన్, లవ్లీనా వంటి స్టార్ బాక్సర్లతో పాటు అమిత్ పంగాల్, నిషాంత్ దేవ్, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పన్వర్ వంటి ఆరుగురు బాక్సర్లతో బరిలోకి దిగిన భారత్‌కు ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. క్వార్టర్స్‌లో గెలిచుంటే లవ్లీనాకు ఏదో ఒక పతకం ఖరారయ్యేది.
పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధు, అనిష్ భన్వాలా క్వాలిఫికేషన్ రౌండ్లో రాణించినా ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయారు. 92 స్కోరుతో విజయ్‌వీర్ 9వ స్థానం దక్కించుకోగా అనిష్ 13వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-6లో ఉన్నవాళ్లు మాత్రమే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మహిళల స్కీట్ పోటీలలో మహేశ్వరి చౌహాన్ 14, రైజా ధిల్లాన్ 23 స్థానాలతో ముగించారు.
అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్ల నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌదరి 8వ స్థానంతో ముగించింది. పురుషుల లాంగ్ జంప్ (గ్రూప్-బి క్వాలిఫికేషన్)లో జెస్విన్ అల్డ్రిన్ 7.61 మీటర్లు దూకి 13వ స్థానంతో కనీసం ఫైనల్స్‌కు అర్హత కూడా సాధించలేకపోయాడు.