నగోయా: హాకీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్‌కు ప్రవేశించింది. ఆఖరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ 4-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పని పట్టింది. ఆట ఆఖరి నిమిషం దాకా స్కోర్లు 3-3తో సమంగా ఉన్నా మ్యాచ్ ముగియడానికి 45 సెకన్ల ముందు అభిషేక్ గోల్ కొట్టి ‘బ్లూ టైగర్స్’ను గట్టెక్కించాడు. మ్యాచ్ తొలి క్వార్టర్‌లోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (5, 13వ నిమిషాల్లో) లభించిన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు.
రెండో క్వార్టర్లో సుఖ్జీత్ (23) ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని 3-0కు చేర్చాడు. కానీ, సెకండాఫ్‌లో పాక్ పుంజుకుంది. 30వ నిమిషంలో అబూ మహ్ముద్ గోల్ చేయగా హన్నన్ షాహిద్ (45), వహీద్ రాణా (49) గోల్స్‌తో స్కోర్లు సమమయ్యాయి. కానీ ఆట చివరి క్షణాల్లో అభిషేక్ చాకచక్యంగా బంతిని నెట్లోకి పంపడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. మరో సెమీస్‌లో సౌత్కొరియాను ఓడించిన మలేషియాతో భారత్.. శనివారం జరిగే ఫైనల్లో ‘గోల్డ్’ కోసం తలపడనుంది.