భారత్, శ్రీలంక కీలక పోరుకు సిద్ధమయ్యాయి. నువ్వానేనా అన్నట్లు సాగుతున్న సిరీస్‌లో విజేత ఎవరో నేడు తేలనుంది. యువకులతో కళకళలాడుతున్న ఇరుజట్లు గెలుపు కోసం కడదాకా పోరాడుతున్నాయి. ‘మిషన్ 2024’లో భాగంగా యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్న టీమ్ఇండియా అందుకు అనుగుణంగా ముందుకెళుతున్నది. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుంటే..మరోవైపు లంక తామేమి తక్కువ కాదన్నట్లు చేతల్లో చూపించేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
రాజ్‌కోట్: భారత్, శ్రీలంక ఆఖరి పోరుకు సర్వశక్తులతో సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై ప్రతాపం చూపించేందుకు టీమ్ఇండియా కసితో ఉంటే ఆసియా చాంపియన్స్‌గా తామేంటో నిరూపించేందుకు లంక తహతహలాడుతున్నది. శనివారం ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జరుగనుంది. పరుగుల వరద పారిన గత మ్యాచ్‌లో టీమ్ఇండియాపై లంకదే పైచేయి కాగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.
గాడిలో పడేనా:
శ్రీలంకతో సిరీస్‌లో భారత్ తడబాటు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్‌లో ఓటమి కోరల్లో నుంచి బయటపడ్డ టీమ్ఇండియా మలి మ్యాచ్‌లో లంక దీటుగా బదులిచ్చింది. టీ20ల్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాగా, ఫామ్‌మీదున్న ఇషాన్‌కిషన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పుణె మ్యాచ్తోజాతీయ జట్టులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి స్వల్ప స్కోరుకే వెనుదిరిగి నిరాశపరిచాడు. బౌలింగ్‌లో తనదైన మార్క్ కనిపిస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. లంక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ బౌండరీలతో హోరెత్తించారు. అయితే జట్టును గెలిపించడంలో వీరిద్దరు సఫలం కాలేకపోయారు. బౌలింగ్ విషయానికొస్తే అర్ష్‌దీప్‌సింగ్ రెండో మ్యాచ్‌లో నోబాల్స్‌తో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. ఒకే ఓవర్లో హ్యాట్రిక్ నోబాల్స్‌తో చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్న అర్ష్‌దీప్ గాడిలో పడాల్సి ఉంది. మరోవైపు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ రాణిస్తున్నా.. పరుగులు నియంత్రించడంలో విఫలమవుతున్నారు. స్పిన్ ద్వయం చాహల్, అక్షర్ పటేల్ ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతున్నారు.
లంక దీటుగా:
భారత్‌కు దీటైన పోటీనిచ్చేందుకు లంక సిద్ధంగా కనిపిస్తున్నది. సిరీస్‌కు ముందు అంతగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక..మైదానంలో టీమ్ఇండియాతో ఢీ అంటే ఢీ అంటున్నది. ముఖ్యంగా కెప్టెన్ దసున్ షనక ఆల్‌రౌండ్ నైపుణ్యంతో జట్టుకు ఆయువు పట్టుగా మారాడు. గత మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఫోర్లు, భారీ సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అదే జోరు ఆఖరి మ్యాచ్‌లో కొనసాగితే లంక ఖాతాలో సిరీస్ చేరినట్లే. మరోవైపు టాపార్డర్‌కు తోడు మిడిలార్డర్ బ్యాటర్లు జత కలిస్తే లంకకు తిరుగుండకపోవచ్చు.
జట్ల అంచనా:
భారత్: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, అక్షర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌సింగ్, చాహల్
శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), నిస్సానక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత అసలంక, సదీరా సమరవిక్రమ/భానుక రాజపక్స, హసరంగ, చమికా కరుణరత్నె, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మదుషనక