IND Vs SA | కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 93 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. హార్మర్, మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలుపొందింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌట్ అయింది. 123 పరుగుల ఆధిక్యంలో నిలిచి, భారత్‌కు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మినహా ఎవరూ దక్షిణాఫ్రికా బౌలర్ల ఎదుట నిలువలేకపోయారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతులో భారత జట్టు ఓటమిపాలైంది. ఆదివారంతో పాటు మరో రెండురోజుల ఆట మిగిలి ఉన్నా టీమిండియా బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచి పరుగులు సాధించడంలో విఫలమయ్యారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం టెస్ట్ మొదలైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రోటీస్ జట్టును కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. సిరాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్ల పడగొట్టగా.. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 189 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్లు హార్మర్ (వికెట్లు), మార్కో జాన్సన్ (3వికెట్లు) రాణించడంతో టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికాపై భారత్‌కు 30 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 153 పరుగులకు మాత్రమే చేసింది. భారత జట్టుకు 124 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు 93 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.
టీమిండియా 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ధ్రువ్ జూరెల్, పంత్, జడేజా తక్కువ స్కోర్‌కే వెనుదిరిగినా సుందర్ (31) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివరలో అక్షర్ పటేల్ భారీ షాట్లతో టీమిండియాను గెలిపించేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సిమన్ హార్మర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్‌కు చెరో రెండు వికెట్లు తీశారు. మార్కరమ్కు ఒక వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్‌కు రాలేదు. గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. గాయంతో కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది.