ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడం కుదరదని, ఏదైనా తటస్థ వేదికలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ సెక్రెటరీ జై షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు దేశాలు పొట్టి ప్రపంచకప్లో తల పడటానికి కొన్ని రోజుల ముందు జై షా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఈ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని, కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏమీ చెయ్యలేదని దానిష్ కనేరియా అన్నాడు. ‘బీసీసీఐ అన్నిటికన్నా రిచ్ బోర్డు. ఐసీసీ ఓవరాల్ ఆదాయంలో 90 శాతం బీసీసీఐ నుంచే వస్తుంది. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయం పీసీబీకి నచ్చకపోయినా.. ఏం చెయ్యలేదు. ఎందుకంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ అన్ని బోర్డులు అన్నీ బీసీసీఐ వేపు ఉంటాయి. ఎందుకంటే బీసీసీఐ లేకుంటే ఆ బోర్డులు కూడా బతకలేవు’ అని కనేరియా వివరించాడు.
పీసీబీలో కొంతకాలం క్రితం కొందరు స్ట్రిక్ట్ అధికారులు ఉండేవారని, కానీ ప్రస్తుతం ఈ బోర్డు చాలా బలహీనంగా ఉందని అన్నాడు. ఇలాంటి బలహీన బోర్డు బీసీసీఐ విషయంలో ఏం చేయలేదన్నాడు. ‘బీసీసీఐ కావాలంటే ఐసీసీ టోర్నీల్లో కూడా పాక్తో ఆడదు. కానీ పీసీబీ ఆ నిర్ణయం తీసుకోలేదు. అయినా ఈ విషయంలో బాధ పడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఒకవేళ బీసీసీఐ ఒప్పుకున్నా.. భారత ప్రభుత్వం ఆ జట్టు పాకిస్తాన్కు పయం అవడానికి అవసరమైన క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు’ అని తెలిపాడు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఇరు దేశాల బోర్డుల అధికారులు సమావేశం అయ్యి చర్చించుకుంటే మంచిదని పేర్కొన్నాడు.