Yashasvi Jaiwal | ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో స్పెషల్ జాబితాలో చేరాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసిన యశస్వీ సెంచరీకి కొద్ది పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. యశస్వీ తన టెస్టు కెరీర్లో పదో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా భారత్‌కు 340 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్దేశించింది.
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 33 పరుగులకు కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత యశస్వి, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే, 121 వద్ద భారత్‌కు నాలుగో దెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ ఔట్ అయ్యాడు. పంత్ 104 బంతుల్లో 30 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పంత్, యశస్వితో కలిసి రెండో సెషన్లో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే, మూడో సెషన్లో ఏకాగ్రత కోల్పోయిన పంత్.. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. యశస్వీతో కలిసి పంత్ 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక పాట్ కమిన్స్ బౌలింగ్‌లో యశస్వీ సైతం అవుట్ అయ్యాడు. అయితే, యశస్వీ ఔట్ వివాదం నెలకొంది. కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతిని లెగ్ సైడ్ నుంచి ఫైన్ లెగ్ వైపుగా ఆడేందుకు యశస్వీ ప్రయత్నించాడు. అయితే, బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఆసిస్ ఆటగాళ్లు అవుట్ కోసం అప్పీల్ చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ, కమిన్స్ డీఆర్ఎస్కు వెళ్లాడు. బంతి యశస్వి బ్యాట్‌కు తగిలిందా ? లేదా? అనేది రీప్లేలో స్పష్టంగా తెలియలేదు. దాంతో స్నికో మీటర్‌తో చెక్ చేసినా తాకినట్లుగా రికార్డు కాలేదు. అయినా.. థర్డ్ అంపైర్ యశస్వీ అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. కామెంట్రేటర్ బ్యాక్స్‌లో ఉన్న భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో థర్డ్ అంపైర్‌పై మండిపడ్డారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో 84 పరుగుల వద్ద యశస్వీ పెవిలియన్‌కు చేరాడు.
అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జైస్వాల్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఉన్న స్పెషల్ క్లబ్లో చేరాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతికొద్ది మంది భారతీయ బ్యాట్స్మెన్లలో ఒకడిగా నిలిచాడు. ఎంసీజీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసిన యశస్వి.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగుల వద్ద వెనుకిదిగాడు. ఈ స్పెషల్ క్లబ్లో ఇప్పటికే మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, జీఆర్ విశ్వనాథ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరంతా ఎంసీజీ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లలో 50 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 1967లో ఈ మైదానంలో పటౌడీ 75, 85 పరుగులు చేశారు. 1977లో జీఆర్ విశ్వనాథ్ 59, 54 పరుగులు చేయగా.. 1999లో ఎంసీజీ టెస్టులో సచిన్ 116, 52 పరుగులు చేశాడు. 2014లో విరాట్ కోహ్లీ 169, 54 పరుగులు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు.