పెట్టని కోటలాంటి గబ్బాపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తున్నది. తొలి రోజు ఆట వరుణుడిదైతే మలి రోజు భారత బౌలర్లను వీరబాదుడు బాదుతూ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. టాపార్డర్ పనిపట్టామనుకున్న టీమ్ఇండియా ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ హెడ్, స్మిత్ గబ్బాలో పరుగుల వరద పారించారు. టీమ్ఇండియాకు కొరకరాని కొయ్యగా మారిన హెడ్ మరోమారు ధనాధన్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. బౌలర్లను ఏమ్రాతం లెక్కచేయకుండా బౌండరీలతో దుమ్మురేపాడు. ఫామ్‌లేమితో ఎదురవుతున్న విమర్శలకు స్మిత్ సెంచరీతో చెక్ పెట్టాడు. హెడ్, స్మిత్ శతకాలతో భారీ ఆధిక్యం దిశగా సాగిన ఆసీస్‌ను బుమ్రా దెబ్బతీశాడు. సహచరులు విఫలమైన చోట ఒంటరి ప్రదర్శనతో కంగారూల నడ్డివిరిచాడు. మూడు రోజులు మిగిలున్న టెస్టులో భారత్‌పై ఆసీస్ ఆధిక్యం కొనసాగుతున్నది.
Ind vs Aus 3rd Test | బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. చెరో టెస్టు గెలిచి 1-1తో సమంగా మూడో టెస్టులో అడుగుపెట్టిన ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆసీస్ ప్రయత్నిస్తుంటే.. టీమ్ఇండియా దీటైన పోటీనిచ్చేందుకు సై అంటున్నది. టెస్టు తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించగా, రెండో రోజు షెడ్యూల్ కంటే అరగంట ముందు మ్యాచ్ ప్రారంభించారు. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 152, 18ఫోర్లు), స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 101, 12ఫోర్లు) సెంచరీలతో విజృంభించారు.
అడిలైడ్ జోరును బ్రిస్బేన్‌లోనూ కొనసాగిస్తూ హెడ్ మరోమారు సెంచరీతో టీమ్ఇండియాపై విరుచుకుపడ్డాడు. అలెక్స్ క్యారీ(45), స్టార్క్ (7) క్రీజులో ఉన్నారు. బుమ్రా (5/72) ఒంటరి ప్రదర్శన కనబర్చగా, సిరాజ్ (1/97), నితీశ్‌కుమార్(1/65) ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. చేతిలో మూడు వికెట్లు ఉన్న ఆసీస్ భారీ స్కోరుపై దృష్టి పెట్టింది. తొలి సెషన్లో కంగారూలకు కళ్లెం వేయకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. మిగిలిన మూడు రోజులు వాతావరణం అనుకూలించే అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటింగ్‌పై ఆందోళన నెలకొన్నది.
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. బీజీటీ సిరీస్‌లో తమకు చేదు మాత్రగా మిగిలిన బుమ్రా మరోమారు ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ(21), మెక్స్వినీ(9) పెవిలియన్ పంపి ఆసీస్ శిబిరంలో ఆందోళన రేపాడు. ఇన్నింగ్స్ మొదలైన నాలుగో ఓవర్లోనే తొలుత ఖవాజను స్వింగ్ డెలివరీతోబుమ్రా తొలివికెట్‌గా సాగనంపాడు. ఆ తర్వాత..మెక్స్వినీ..కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఖవాజను ఆనుసరించాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో లబుషేన్(12), స్మిత్ ఇన్నింగ్స్‌ను గాడిలో వేసే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకునేందుకు వీరు ప్రయత్నం చేయగా, బౌలింగ్ మార్పుగా వచ్చిన తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి..లబుషేన్‌ను ఔట్ చేసి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. దీంతో 75 పరుగులకే ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో స్మిత్‌కు హెడ్ జత కలువడం ఇన్నింగ్స్ గతిని మార్చింది.
సిరీస్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ హెడ్..ఆది నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హెడ్‌ను అడ్డుకునేందుకు అటాకింగ్ ఫీల్డ్ పెట్టాల్సిన కెప్టెన్ రోహిత్..సింగిల్స్‌కు అవకాశమివ్వడంతో అతని పని సులువైంది. ఇదే అదనుగా క్రీజులో పాతుకుపోయిన హెడ్..బౌండరీలతో విరుచుకుపడ్డాడు. స్వల్ప గాయంతో సిరాజ్ ఓవర్ మధ్యలోనే పెవిలియన్ వెళ్లడం కొంత అలజడి కల్గించింది. కొత్త బంతి కోసం ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిచ్చిన రోహిత్..జడేజా, నితీశ్‌తో బౌలింగ్ చేయించడం హెడ్, స్మిత్‌కు కలిసొచ్చింది.
ఈ క్రమంలో హెడ్ తొలుత సెంచరీ ఖాతాలో వేసుకోగా, ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ ఏడాది తొలి సెంచరీని స్మిత్ అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో స్మిత్‌కు ఇది 33వది కాగా, భారత్‌పై 10వ కావడం విశేషం. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బుమ్రా విడదీయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్‌తో స్మిత్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన మార్ష్(5), హెడ్ పరుగు తేడాతో పెవిలియన్ చేరడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆఖర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్..కెప్టెన్ కమిన్స్(20)ను ఔట్ చేశాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 101 ఓవర్లలో 405/7(హెడ్ 152, స్మిత్ 101, బుమ్రా 5/72, నితీశ్ 1/65).