IND Vs AUS | ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ జరుగుతున్నది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచులు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇటీవల పలువురు ఆటగాళ్లు ఇంగ్లండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌తో పోలుస్తున్నారు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాషెస్ సిరీస్ కంటే భారత్ – ఆస్ట్రేలియా పోరు పెద్దదని అన్నారు. ఆసిస్ ప్రైమినిస్టర్స్ లెవెన్‌తో వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెటర్లు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ని చూసే వారి సంఖ్య బాగా పెరిగిందని.. ఐపీఎల్ సైతం మెగా లీగ్‌గా మారిందని పేర్కొన్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో వెళ్లాలనని.. ఆ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమని.. అక్కడి ప్రజలు క్రికెట్‌పై చాలా మక్కువ చూపుతున్నారన్నారు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ రెండు జట్ల మధ్య పోటీని మరింత పెంచిందని, ఎంసీజీలో జరిగే బాక్సింగ్ డే టెస్టు చాలా కీలకం కానుందని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఆల్బనీస్ మాట్లాడుతూ భారత్‌తో లండన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడామని.. తమ జట్టు విజయం సాధించిందన్నారు. అయితే ఈ సిరీస్‌లో పోటీ నువ్వానేనా అన్నట్లుగా జరిగింది. గతంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ జరిగిందని.. ప్రస్తుతం 5 టెస్టులు జరుతుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు చాలా కీలకం కానుండగా.. ఆ మ్యాచ్‌ని చూసేందుకు దాదాపు లక్ష మంది ప్రేక్షకులు చేరుకునే అవకాశం ఉందని.. ఆస్ట్రేలియా పర్యాటకానికి కీలకమైందన్నారు.
కాన్బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో భారత జట్టు భేటీ అయ్యింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని బృందం, ఆస్ట్రేలియా పీఎం XI జట్టు పార్లమెంటులో ఆస్ట్రేలియా ప్రధానిని కలిశాయి. అల్బనీస్ భారత జట్టుతో సరదాగా సంభాషించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆయనకు జట్టును పరిచయం చేశాడు. జస్ప్రీత్ బుమ్రాను అల్బనీస్ ముచ్చటించారు. ఇతర బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుందన్నారు. భారత్-ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేకపోయారు. డిసెంబర్ 6 నుంచి జరగనున్న అడిలైడ్ టెస్టుకు ముందు ఇరు జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటున్నాయి.