IND Vs AUS | ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య శనివారం మూడో టెస్ట్ జరుగనున్నది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. రెండు టెస్ట్‌కు గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. హేజిల్‌వుడ్‌ను జట్టులోకి తీసుకోవడంతో స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టింది. అడిలైడ్ డే-నైట్ టెస్టులో హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్కు తుది జట్టులో స్థానం కల్పించిన విషయం తెలిసిందే.
కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ బోలాండ్ అడిలైడ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తు చేశారు. గబ్బా టెస్ట్‌కు ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. దురదృష్టవశాత్తు అతను గత 18 నెలల్లో బెంచ్‌పైనే ఎక్కువ సమయం గడిపాడని పేర్కొన్నారు. తుదిజట్టులో స్థానం దొరిగినప్పుడల్లా రాణించాడన్నాడు. ఎంసీజీలో నాల్గో టెస్ట్‌కు అతను ఆడే అవకాశం ఉందని చెప్పాడు. శనివారం ప్రారంభమయ్యే టెస్ట్ సందర్భంగా క్యూరేటర్ డేవిడ్ సాండూర్స్కీ మాట్లాడుతూ మ్యాచ్ కోసం భిన్నమైన పిచ్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
సాధారణంగా సీజన్ ప్రారంభంలో పిచ్‌లు కొంచెం కొత్తగా ఉంటాయని.. అదే సమయంలో ఎక్కువ వేగం, బౌన్స్ కలిగి ఉంటాయన్నారు. సాధారణంగా ప్రతిసారీ ఇలాంటి పిచ్‌నే సిద్ధం చేస్తామన్నారు. ఇక్కడి పిచ్‌పై వేగంతో పాటు బౌన్స్‌ను రాబట్టవచ్చని పేర్కొన్నారు. గబ్బాకు మంచి చరిత్రే ఉన్నది. పేస్, బౌన్స్‌కు స్వర్గధామం కాగా.. పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే ఆసిస్ ప్లేయర్లు సైతం జంకుతారు. ఈ పిచ్‌పై ఎన్నో లో-స్కోరింగ్ మ్యాచులు నమోదైయ్యాయి. ఇప్పటి వరకు గబ్బా వేదిక టీమిండియా ఏడు టెస్ట్‌లు ఆడింది. ఇందులో ఐదింట ఓడిపోగా.. ఒక్కసారి విజయాన్ని నమోదు చేసింది. మరో టెస్ట్ డ్రాగా ముగిసింది. 2021లో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించింది.