IND vs AUS T20I: వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ డిసెంబర్ 03 వరకూ జరగాల్సి ఉంది. అయితే పలు రాష్ట్రాలలో ఎన్నికలతో పాటు ఇతరత్రా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రీషెడ్యూల్ లేదా వేదికలను మార్చే అవకాశాలున్నట్టు సమాచారం.
ఇదివరకే డిసెంబర్ 3న హైదరాబాద్ వేదికగా జరగాల్సి ఉన్న ఆఖరి టీ20కి భద్రత కల్పించలేమని పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు విన్నవించిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే రోజు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉప్పల్ లో జరుగబోయే మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చిచెప్పడంతో బీసీసీఐ ఈ మ్యాచ్ వేదికను మార్చే విషయమై తలలు పట్టుకుంటుండగా ఇప్పుడు మరో వేదిక కూడా మారే అవకాశముంది.
హైదరాబాద్ కంటే ముందే డిసెంబర్ 01న నాగ్‌పూర్ (మహారాష్ట్ర) వేదికగా భారత్-ఆసీస్ నాలుగో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా వేదిక మారే అవకాశం ఉన్నట్టు సమాచారం. కారణాలు తెలియరాకున్నా విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) ఇదివరకే ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నాలుగో టీ20ని నాగ్‌పూర్‌లో కాకుండా ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. అయితే ఇది కూడా అంత ఈజీ కాదు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దఫాలు (నవంబర్ 7, 17 తేదీలలో)గా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 03న ఫలితాలు వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాలలో అత్యంత సున్నితమైన రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో అదీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి రెండ్రోజుల ముందు మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యమా..? అన్నది అనుమానంగానే ఉంది. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.