అల్ అమెరాత్(ఒమన్): భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అదరగొడుతున్నారు. ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ భరతం పట్టిన భారత్..మలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ సారథ్యంలోని టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయదుందుభి మోగించింది.
తద్వారా వరుసగా రెండు విజయాలతో గ్రూపు-బిలో నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. మ్యాచ్ విషయానికొస్తే..తొలుత రసిక్ సలామ్(3/15), రమణ్‌దీప్‌సింగ్(2/7) ధాటికి యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా(50) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.
భారత యువ బౌలర్ల ధాటికి యూఏఈలో ఎనిమిది మంది బ్యాటర్లు రెండెంకల స్కోరు అందుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బౌలర్లు చెలరేగడంతో యూఈఏ బ్యాటర్లు చేష్టలుడిగిపోయారు. ముఖ్యంగా రసిక్ సలామ్ స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మూడు వికెట్లతో రాణించిన రసిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్..బుధవారం ఒమన్‌తో తలపడుతుంది.
ఆడుతూ పాడుతూ:
స్వల్ప లక్ష్యాన్ని యువ భారత్ టీమ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌సింగ్(8) నిరాశపరిచినా..అభిషేక్‌శర్మ(24 బంతుల్లో 58, 6ఫోర్లు, 4సిక్స్‌లు), కెప్టెన్ తిలక్‌వర్మ(18 బంతుల్లో 21, 2ఫోర్లు, సిక్స్) లక్ష్యం వైపు సాఫీగా సాగారు. ఈ మధ్య ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, నాలుగు భారీ సిక్స్‌లతో చెలరేగాడు. సుకుమారన్ బౌలింగ్‌లో తిలక్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తిలక్‌ను అనుసరిస్తూ అభిషేక్ పెవిలియన్ చేరినా..నేహాల్ వధేరా(6 నాటౌట్), ఆయూశ్ బదోని(12 నాటౌట్) 10.5 ఓవర్లలో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. షఫీ రెహమాన్, ఫారుఖ్, సుకుమారన్ ఒక్కో వికెట్ తీశారు.
ఇషాన్‌కిషన్ రీ ఎంట్రీ భారత ‘ఎ’ జట్టులో చోటు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్‌కిషన్ చోటు దక్కించుకున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబైపై సెంచరీ ద్వారా ఇషాన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. సోమవారం 15 మందితో ప్రకటించిన జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత భారత సీనియర్ జట్టుతో కలిసి మూడు రోజుల మ్యాచ్‌లో తలపడనుంది. భారత ‘ఎ’ జట్టులో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్, నితీశ్‌కుమార్‌రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, యశ్ దయాల్ లాంటి క్రికెటర్లకు చోటు కల్పించారు.
సంక్షిప్త స్కోర్లు
యూఏఈ: 16.5 ఓవర్లలో 107 ఆలౌట్(రాహుల్ 50, హమీద్ 22, రసిక్ 3/15, రమణ్‌దీప్ 2/7), భారత్ ‘ఎ’: 10.5 ఓవర్లలో 111/3(అభిషేక్ 58, తిలక్ 21, సుకుమారన్ 1/10, ఫారుఖ్ 1/16)