న్యూయార్క్: అమెరికా యువ సంచలనం కోకో గాఫ్.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దుమ్మురేపుతున్నది. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఈ 19 ఏండ్ల యంగ్‌స్టర్.. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ గాఫ్ 6-4, 7-5తో పదో సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) పై అలవోక విజయంతో తుదిపోరుకు అర్హత సాధించింది.
మరో సెమీఫైనల్లో అరియానా సబలెంక (బెలారస్) 0-6, 7-6 (7/1), 7-6 (10/5)తో మాడిసన్ కైస్ (అమెరికా)పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అత్యంత ఆసిక్తికరంగా సాగిన ఈ పోరులో తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా గెలువలేకపోయిన రెండో సీడ్ సబలెంక.. ఆ తర్వాత రెండు సెట్లలో దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో గాఫ్‌తో సబలెంక అమీతుమీ తేల్చుకోనుంది.
వరుస విజయాలతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరిన భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్నకు తుదిపోరులో నిరాశ ఎదురైంది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆరో సీడ్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6-2, 3-6, 4-6తో మూడో సీడ్ రాజీవ్ రామ్-జోయ్ సాలిస్బురీ ద్వయం చేతిలో ఓడి రన్నరప్ టైటిల్ చేజిక్కించుకుంది.