Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందు ఆదివారం నాలుగు గంటల నుంచి అన్ని ఫ్రాంచైజీలు వచ్చే సీజన్లో తాము రిటైన్ చేసుకుని వదిలించుకున్న జాబితాను విడుదల చేశాయి. అయితే గత కొన్నాళ్లుగా అందరినీ ఆకర్షించిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా బదిలీ ప్రక్రియ మాత్రం ఎవరికీ ఊహించని షాకిచ్చింది. హార్ధిక్‌ను ముంబై తిరిగి తీసుకునే ప్రక్రియ దాదాపు పూర్తయిందని, వేలానికి ముందే ముంబై కీలక ఆటగాళ్లను వదిలేసి పర్స్ వాల్యూను పెంచుకోనుందనీ పుకార్లు షికార్లు చేశాయి. కానీ తీరా ఆదివారం గుజరాత్ ప్రకటించిన రిటెన్షన్ లిస్ట్‌లో హార్ధిక్ పేరు ఉండటంతో అభిమానులు ఇది పోకిరిలో క్లైమాక్స్ కన్నా మించిన ట్విస్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
గుజరాత్ తాజాగా విడుదల చేసిన రిటెన్షన్ లిస్ట్‌లో హార్ధిక్ పేరు కూడా ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో విభేదాల కారణంగా పాండ్యా.. ఆ జట్టును వీడి తన మాజీ జట్టు ముంబై ఇండియన్స్‌కు చేరనున్నాడని, ఈ మేరకు నిధుల మళ్లింపు ప్రక్రియ కూడా ప్రారంభమైందని వార్తలు వచ్చాయి. హార్ధిక్‌ను 2022లో గుజరాత్ రూ. 15 కోట్లకు దక్కించుకుంది. ట్రేడ్ ప్రక్రియలో భాగంగా ఈ మొత్తాన్ని గుజరాత్‌కు చెల్లించి కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్లను ముంబై వేలానికి వదిలేయనుందని గుసగుసలు వినిపించాయి. రాబోయే సీజన్ తర్వాత రోహిత్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పడమే ఆలస్యమని కూడా అభిమానులు భావించారు. కానీ తీరా రిటెన్షన్ లిస్ట్‌లో మాత్రం పాండ్యా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Gujarat retained & released players list. [Star Sports] pic.twitter.com/6Z65I5myAN
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
కథ ఇంకా ఉంది..
హార్థిక్‌ను గుజరాత్ రిటైన్ చేసుకున్నా వేలానికి వారం రోజుల ముందు వరకూ ట్రేడ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతానికి హార్ధిక్ బదిలీ హోల్డ్‌లో ఉన్నా అతడు ముంబై చేరడం లాంఛనమే అని సమాచారం. డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం జరగాల్సి ఉండగా డిసెంబర్ 12 దాకా ఫ్రాంచైజీలకు ట్రేడ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. మరి హార్ధిక్ ముంబైలో చేరతాడా..? లేదా..? అన్నది మరో పదిహేను రోజుల్లో క్లారిటీ రానుంది.
గుజరాత్ రిటైన్డ్ లిస్ట్ః హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండె, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ
రిలీజ్ లిస్ట్ః యశ్ దయాల్, కె.ఎస్. భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ శనక