Hajras Singh: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా బెనోనిలో భారత్ – ఆస్ట్రేలియా తుదిపోరులో ఆసీస్ తరఫున అర్థ సెంచరీ సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ హర్జాస్ సింగ్. భారత మూలాలు ఉన్న ఈ 19 ఏండ్ల కుర్రాడు.. ఆసీస్ 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో ఆ జట్టును ఆదుకున్నాడు. 64 బంతులాడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఇంతకీ ఎవరీ హర్జాస్ సింగ్..? భారత్‌కు ఇతడికి ఉన్న సంబంధమేంటి..?
ఎవరీ హర్జాస్..?
2005లో సిడ్నీలో పుట్టిన హర్జాస్ తల్లిదండ్రులది పంజాబ్ లోని చండీగడ్. హజ్రాస్ తండ్రి ఇంద్రజీత్ సింగ్ స్టేట్ లెవల్ బాక్సింగ్ ఛాంపియన్ కాగా తల్లి అవిందర్ కౌర్ రాష్ట్ర స్థాయి లాంగ్ జంపర్. ఈ ఇద్దరూ హర్జాస్ పుట్టడానికి ఐదేండ్ల ముందే సిడ్నీకి వలసవెళ్లారు. సిడ్నీలోనే పుట్టి పెరిగిన ఈ కుర్రాడు పేరెంట్స్ మాదిరిగానే క్రీడలనే కెరీర్‌గా ఎంచుకున్నాడు. 8 ఏండ్లకే బ్యాట్ పట్టిన హర్జాస్.. స్థానికంగా ఉన్న క్రికెట్ అకాడమీలలో ట్రైన్ అయ్యాడు.
Harjas Singh hits his first fifty of the tournament and what a game to get it 👏 https://t.co/ZdVh1ADzpX | #U19WorldCup | #INDvAUS pic.twitter.com/rexSwVos0Q
— ESPNcricinfo (@ESPNcricinfo) February 11, 2024
భారత్‌లో చుట్టాలున్నారు..
పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబం నుంచి పుట్టిన హర్జాస్.. గతంలో తాను తరుచూ భారత్‌కు వస్తుండేవాడినని.. చండీగఢ్, అమృత్‌సర్‌లో తనకు చుట్టాలున్నారని ఫైనల్ మ్యాచ్‌కు ముందు చెప్పుకొచ్చాడు. ‘మాకు మా పేరెంట్స్ తరఫున చుట్టాలు చండీగఢ్, అమృత్‌సర్‌లో ఉన్నారు. చండీగఢ్‌లోని సెక్టార్ 44-Dలో మా ఇల్లు ఇప్పటికీ ఉంది. చిన్నప్పుడు నేను తరుచూ ఇక్కడికి వస్తుండేవాడిని. మా బాబాయ్ అక్కడే ఉంటాడు. 2015లో ఆఖరిసారి భారత్‌కు వచ్చా. ఆ తర్వాత క్రికెట్, చదువుతో పూర్తి బిజీ అయిపోయా..’ అని అన్నాడు.
ఆసీస్ టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఆరాదించే హర్జాస్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో రాణించి ఆసీస్ అండర్ – 19 టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే లీగ్ దశతో పాటు సూపర్ సిక్స్, సెమీస్ దశలో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 49 పరుగులే చేసిన హర్జాస్.. కీలకమైన తుదిపోరులో మాత్రం నిలబడ్డాడు. వికెట్ కీపర్ ర్యాన్ హిక్స్ తో కలిసి నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఆసీస్ 250 పరుగుల మైలురాయి చేరడంలో కీలకపాత్ర పోషించాడు.