గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Nov 20, 2020 , 13:05:57

అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడాలంటే క‌నీస వ‌య‌సు ఎంత‌?

అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడాలంటే క‌నీస వ‌య‌సు ఎంత‌?

దుబాయ్‌: అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌టానికి క‌నీస వ‌య‌సును నిర్ధారించింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఇక మీద‌ట క‌నీసం 15 ఏళ్లు నిండితేనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లో 15 ఏళ్లలోపు ప్లేయ‌ర్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ టీమ్‌లో ఆడించేందుకు సంబంధిత స‌భ్య దేశం ఐసీసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ మేర‌కు బోర్డు క‌నీస వ‌య‌సు నిబంధ‌న‌కు ఆమోదం తెలిపిన‌ట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఐసీసీ ఈవెంట్లు స‌హా ద్వైపాక్షిక క్రికెట్‌, అండ‌ర్ 19 క్రికెట్‌కు కూడా ఇదే నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని, ప్లేయ‌ర్స్‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐసీసీ స్ప‌ష్టం చేసింది. 

ఒక‌వేళ అసాధార‌ణ ప‌రిస్థితులు ఎదురైతే 15 ఏళ్ల‌లోపు ప్లేయ‌ర్‌ను త‌మ నేష‌న‌ల్ టీమ్‌లో ఆడించేందుకు ఐసీసీ అనుమ‌తి కోరుతూ సంబంధిత స‌భ్య దేశం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడేందుకు త‌గిన సామ‌ర్థ్యం, ఆ ప్లేయ‌ర్‌కు ఉన్న అనుభ‌వం, మాన‌సిక ఎదుగుద‌ల వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఐసీసీ అనుమ‌తి ఇవ్వ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు ఎలాంటి వ‌య‌సు ప‌రిమితి లేదు. అత్యంత పిన్న వయ‌సులో అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన రికార్డు పాకిస్థాన్‌కు చెందిన హ‌స‌న్ ర‌జా పేరిట ఉంది. అత‌డు 14 ఏళ్ల 227 రోజుల వ‌య‌సులోనే టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాక్ త‌ర‌ఫున 1996-2005 మ‌ధ్య 7 టెస్టులు, 16 వ‌న్డేలు ఆడాడు. ఇక ఇండియా త‌ర‌ఫున ఈ రికార్డు లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. అత‌డు 16  ఏళ్ల 205 రోజుల వ‌య‌సులో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.