హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం దక్కన్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ 2-1తో చర్చిల్ బ్రదర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీనిధి తరపున ఫైజల్ షాయెజ్(23ని), అంజెల్ ఒర్లీన్(72ని) గోల్స్ చేశారు. లామెగోలెన్ హన్‌సింగ్(91ని)..చర్చిల్ బ్రదర్స్‌కు ఏకైక గోల్ అందించాడు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పుణెలో పీకేఎల్ పోరు
పుణె: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) మూడో అంచె పోటీలకు పుణె సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్, నోయిడా వేదికలుగా మ్యాచ్‌లు ముగియగా, మూడో అంచె పోటీలకు మంగళవారం నుంచి పుణెలో తెరలేవనుంది. ఈనెల 3న మొదలయ్యే పుణె అంచె పోటీలు 29వ తేదీత ముగియనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ పుణెరీ పల్టాన్ సొంతగడ్డపై సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. మంగళవారం బెంగళూరు-గుజరాత్, యూ ముంబా-పుణెరీ పల్టాన్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.