HFC | హైదరాబాద్: హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) చీఫ్ కోచ్ తాంగ్బోయి సింగ్టోపై వేటు పడింది. ఐఎస్ఎల్ ప్రస్తుత సీజన్లో హెచ్ఎఫ్సీ పేలవ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాదాపు ఐదేండ్లకు పైగా హెచ్‌ఎఫ్‌సీతో కొనసాగుతున్న సింగ్టోను గతేడాది హెడ్‌కోచ్‌గా నియమించింది.
నిరుటి సీజన్‌తో పాటు ప్రస్తుత సీజన్లో జట్టు ప్రదర్శన దారుణంగా తయారైంది. హెచ్ఎఫ్సీ 11 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు ఒక డ్రాతో 12వ స్థానంలో కొనసాగుతున్నది. సింగ్టో స్థానంలో శమీల్ చెంబాకత్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తాడని హెచ్ఎఫ్సీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మణిపూర్‌కు చెందిన సింగ్టో గతంలో నార్త్ఈస్ట్ యునైటెడ్, కేరళ బ్లాస్టర్స్ సహాయక కోచ్‌గా వ్యవహరించాడు.