బాంబోలిమ్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా బాంబోలిమ్ స్టేడియం వేదికగా హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ), ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య రసవత్తర సమరం జరుగనుంది. హెచ్ఎఫ్సీ తమ వరుస విజయాల జోరును కొనసాగించాలన్న పట్టుదలతో కనిపిస్తుంటే..మరోవైపు నిలకడలేమితో సాగుతున్న గోవా తమ పట్టు నిలుపుకునేందుకు తహతహలాడుతున్నది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 10 పాయింట్లతో హెచ్ఎఫ్సీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంటే..గోవా రెండు విజయాలు, మూడు ఓటములతో ఎనిమిదిలో కొనసాగుతున్నది. లీగ్‌లో అత్యుత్తమ జట్లపై అద్భుత విజయాలు సొంతం చేసుకున్న హైదరాబాద్..అదే ఊపులో గోవాను చిత్తు చేయాలని చూస్తున్నది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్‌పై 5-1తో ఘన విజయం సాధించిన హెచ్ఎఫ్సీ తమదైన రోజున ప్రత్యర్థికి దీటుగా పోటీనిస్తుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీపై విజయయాత్ర మొదలుపెట్టిన హెచ్ఎఫ్సీ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. జంషెడ్‌పూర్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించుకున్న హైదరాబాద్..వరుసగా బెంగళూరు, నార్త్ఈస్ట్ భరతం పట్టింది. ఎలాగైనా టాప్-4లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్న మార్కెజ్ మనాలో నేతృత్వంలోని హెచ్ఎఫ్సీ అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నది. ప్రత్యర్థి బలబలాలను అంచనా వేస్తూ తమదైన వ్యుహాలతో ముందుకెళుతున్నది. ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్‌లో గోవాను ఓడించేందుకు హెచ్ఎఫ్సీ పూర్తి సన్నద్ధతో ఉంది. మరోవైపు గోవాను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఈస్ట్ బెంగాల్, బెంగళూరుపై విజయాలు సాధించిన గోవా..హైదరాబాద్‌తోనూ అమీతుమీ తేల్చుకునేందుకు పావులు కదుపుతున్నది.