హైదరాబాద్, ఆట ప్రతినిధి : దేశవ్యాప్తంగా వాలీబాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మొదలుకానున్న ఈ మెగా లీగ్‌లో పది జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మొదటి రోజు ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్.. డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్తో మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమవనుంది.
బ్లాక్‌హాక్స్‌కు బ్రెజిల్ ఆటగాడు పాలో లమౌనీర్ సారథ్యం వహిస్తుండగా కాలికట్కు మోహన్ ఉక్రపాండియన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సీజన్లో టైటిల్ స్పాన్సర్‌గా ఆర్ఆర్ కేబుల్ వ్యవహరిస్తున్నది. గత ఎడిషన్ల మాదిరిగానే నాలుగో సీజన్ సైతం అభిమానులకు ప్రపంచ స్థాయి అనుభూతిని పంచుతుందని నిర్వాహకులు తెలిపారు.