హ్యాండ్‌బాల్ క్రీడకు ఆదరణ రోజురోజుకు పెరుగుతున్నది. క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ లాంటి మాస్ క్రీడలకు ఏమాత్రం తీసిపోకుండా దూసుకెళుతున్నది. ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా జూనియర్ మహిళల చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన భారత్.. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టోర్నీకి అర్హత సాధించింది. దీనికి తోడు జాతీయస్థాయి టోర్నీల ద్వారా ఆణిముత్యాల్లాంటి ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారు. తెలంగాణకు చెందిన క్రీడా ఔత్సాహికుడు అరిశనపల్లి జగన్మోహన్రావు జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆట రూపురేఖలు మారిపోయాయి. హైదరాబాద్ వేదికగా జాతీయ సీనియర్ మహిళల టోర్నీని ఘనంగా నిర్వహించిన ఆయన.. భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించారు. హ్యాండ్‌బాల్ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతానన్న జగన్.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత ముందుకెళుతామని ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
హ్యాండ్‌బాల్ అభివృద్ధిపై మీ విజన్?
దేశంలో హ్యాండ్‌బాల్ అభివృద్ధిపై పక్కా విజన్‌తో ఉన్నాం. హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నాం. ఇటీవల ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్ పసిడి పతక ప్రదర్శన వెనుక ఎంతో కృషి దాగి ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రత్యేక హ్యాండ్‌బాల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి అమ్మాయిలకు అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నాము. దాదాపు 190 మంది అమ్మాయిలు అక్కడ శిక్షణ పొందుతున్నారు. సాయ్ సహకారంతో పాటు హెచ్ఎఫ్ఐ ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన భారత జట్టులో ఐదుగురు ప్లేయర్లు ఇక్కడి వారే కావడం విశేషం.
హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు చేస్తారా?
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హ్యాండ్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాం. ఈ మధ్య దుబాయ్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసినప్పుడు వారు ఆటను అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వారి మద్దతుతో రానున్న కొద్ది రోజుల్లో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్ హబ్‌గా మార్చబోతున్నాం. అత్యుత్తమ సౌకర్యాలతో అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళుతాం. నగరంలో ఎక్కడైనా స్థలం కేటాయిస్తే అందుకు తగ్గట్లు సకల హంగులతో రెండు, మూడు నెలల్లో అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. బ్యాడ్మింటన్ తరహాలో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్ హబ్‌గా మారుస్తాం.
ఆట అభివృద్ధి కోసం ప్రణాళికలేంటి?
హ్యాండ్‌బాల్ అభివృద్ధిపై మేము స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్లేయర్లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా దేశంతో పాటు రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యాసంస్థలపై నజర్ పెట్టాం. ప్రతిభ కల్గిన పిల్లలను గుర్తించి వారికి మెరుగైన శిక్షణనివ్వనున్నాం. ఇటీవల జాతీయ జట్టుకు ఎంపికైన ఆదిలాబాద్‌కు చెందిన కరీనా చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నది. రానున్న రోజుల్లో కరీనా లాంటి మరింత మంది అమ్మాయిలను వెలుగులోకి తీసుకొస్తాం. ఇటీవలే మంత్రి కేటీఆర్.. కరీనాకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
హైదరాబాద్‌లో జాతీయటోర్నీ ఉంటుందా?
ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ తర్వాత హైదరాబాద్‌లో ఆ స్థాయి అంతర్జాతీయ టోర్నీ మళ్లీ జరుగలేదు. ఆగస్టులో భారీ ఎత్తున స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహణకు యోచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు పలు కంపెనీల మద్దతుతో కనివినీ ఎరుగని రీతిలో క్రీడ ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. సీఎం టోర్నీ పేరుతో ప్లాన్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నది. సీఎం కేసీఆర్ ఏదైనా అనుకుంటే కచ్చితంగా దాన్ని ఆచరణలో చేసి చూపిస్తారు. మొత్తంగా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి నా వంతు సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.
ద్వితీయ శ్రేణి నగరాలపై మీ ఫోకస్?
హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ వేదికగా రెండు జాతీయస్థాయి టోర్నీలు నిర్వహించాం. ప్రభుత్వ సహకారంతో ఎక్కడా ఏర్పాట్లకు లోటు కాకుండా అత్యుత్తమ సౌకర్యాలతో టోర్నీలను ఘనంగా నిర్వహించాం. హ్యాండ్‌బాల్ టోర్నీలను హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకు విస్తరించాలన్న ఆలోచన ఉంది. అయితే హ్యాండ్‌బాల్‌ను ఇండోర్ స్టేడియాల్లో నిర్వహించాలన్న ఉద్దేశంతో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాం. భవిష్యత్‌లో కచ్చితంగా ఔట్‌డోర్‌లో కాకుండా ఇండోర్గేమ్గా ఆటను తీర్చిదిద్దుతాం.