Paris Olympics | విల్లెపింటె(ఫ్రాన్స్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో మరో వివాదం రాజుకుంది. ఇప్పటికే ఆరంభ వేడుకల్లో అతి చేయడం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు..ప్రస్తుతం మహిళల బాక్సింగ్ పోటీల్లో పురుష లక్షణాలు ఉన్న వాళ్లను అనుమతించి అభాసుపాలయ్యారు. విశ్వక్రీడల్లో మహిళల బాక్సింగ్ పోటీలు హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం జరిగిన మహిళల 66కిలోల బౌట్ ఇందుకు కారణమైంది. అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్, ఇటలీ బాక్సర్ ఎంజెలా కెరినీ మధ్య బౌట్ అగ్నికి ఆజ్యం పోసింది. తన తండ్రి కలను సాకారం చేసేందుకు కొన్ని ఏండ్లుగా కఠోర శిక్షణ తీసుకున్న కెరినీ..పారిస్‌లో పతకాన్ని ముద్దాడాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ ఆమె ఆశలు ఖెలిఫ్ రూపంలో ఆదిలోనే ఆవిరయ్యాయి. బౌట్ మొదలైన 46 సెకన్ల వ్యవధిలోనే కెరినీ కన్నీటి పర్యంతం అవుతూ ఓటమికి ఒప్పుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. తన కెరీర్లో ఇప్పటి వరకు ఎదుర్కొని పవర్ఫుల్ పంచ్‌లను ఎదుర్కొవడంతో బాధకు గురైన కెరినీ బౌట్లో కన్నీరు కారుస్తూ కుప్పకూలిపోయింది. తన కోచ్‌తో మాట్లాడి బౌట్లో కొనసాగలేనంటూ రింగ్‌ను వీడింది. ఎంజెలా కెరినీ, ఇమానె ఖెలిఫ్ మధ్య బాక్సింగ్ పోరు ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌ను షేక్ చేస్తున్నది. టెస్టోస్టిరాన్(పురుష లక్షణాలు) ఎక్కువ ఉన్న ఖెలిఫ్‌కు ఎలా అనుమతిచ్చారంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ)పై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన 57కిలోల తొలి బౌట్లో తైవాన్ బాక్సర్ లిన్ యు టింగ్..సితోర తుర్దిబెకోవాపై గెలిచి ముందంజ వేసింది.
ఐవోసీపై ట్రంప్, మస్క్ గరం : పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్న మహిళా బాక్సర్లను పారిస్ ఒలింపిక్స్‌కు అనుమతించిన ఐవోసీ నిర్వాహకులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్, ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ తమదైన రీతిలో తూర్పార పట్టారు. ‘మహిళల పోటీల్లో పురుషులు లేకుండా చేస్తా’ అని ట్రంప్ ఘాటుగా స్పందించాడు. మరోవైపు జేకే రౌలింగ్ ఎక్స్‌లో స్పందిస్తూ ‘ ఈ పోటీని చూడండి.. మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మహిళపై పురుషుడు బహిరంగంగా దాడి చేయడానికి మీరు ఎలా అనుమతిస్తారు? ఇది క్రీడ కాదు. స్త్రీలపై పురుషులు తమ ఆధిపత్యం ప్రదర్శించడం కిందికే వస్తుంది. అసలు ఈ పోటీకి నిర్వాహకులు ఎలా అనుమతి ఇచ్చారు’ అంటూ మండిపడింది. కెరినీకి మద్దతుగా అమెరికా స్విమ్మర్ పెట్టిన ట్వీట్‌కు మస్క్ మద్దతుగా నిలిచాడు. ఇలా ఒక్కరిద్దరికే పరిమితం గాకుండా ఇటలీ ప్రధానమంత్రి గ్రెగోరియన్ మెలోనీ తమ దేశ బాక్సర్‌కు అండగా నిలిచాడు.
ఖెలిఫ్‌కు ద్యుతి మద్దతు : ‘మోతాదుకు మించి టెస్టోస్టిరాన్ స్థాయిపై 2014లో అంతర్జాతీయ అత్యున్నత క్రీడాన్యాయ స్థానంలో సవాలు చేసి ఐవోసీపై నేను విజయం సాధించాను. హర్మోన్ స్థాయి అనేది అథ్లెట్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపదు. ఆ సమయంలో నా లింగంపై వివాదం నెలకొంది. ప్రస్తుతం ఖెలిఫ్ విషయంలోనూ అదే జరుగుతున్నది. ఖెలిఫ్ శరీరంలో టెస్టోస్టిరాన్ నిల్వలపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సోషల్‌మీడియాలో దీనిపై చర్చగా జరుగుతున్నది. అథ్లెట్లను అన్ని రకాలుగా పరీక్షిస్తూనే ఉంటారు’ ద్యుతి పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఖెలిఫ్, లిన్ యు టింగ్ ప్రాతినిధ్యాన్ని ఐవోసీ పూర్తిగా సమర్థించుకుంది. ‘వాళ్ల పాస్‌పోర్ట్‌లపై మహిళలు అనే ఉంది. టోక్యోలోనూ వారు మహిళల విభాగంలోనే పోటీపడ్డారు. పారిస్ బాక్సింగ్ యూనిట్ నియమ, నిబంధనలకు అనుగుణంగా బాక్సర్లు అర్హత సాధించారు’ అని ఐవోసీ పేర్కొంది.
అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ)పై ఐవోసీ సస్పెన్షన్ కొనసాగుతున్నది. కార్యకలాపాలు సరిగ్గా లేవన్న కారణంతో ఐబీఏ వ్యవహారాలపై నిషేధం ఉంది. బాక్సింగ్ టోర్నీల విషయంలో ఐబీఏ, ఐవోసీ మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. 2023 ఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ నుంచి ఖెలిఫ్, లిన్ యును ఐబీఏ తప్పించింది. పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో ఐబీఏ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఐవోసీ తీవ్ర స్థాయిలో స్పందించింది. అప్పటి వరకు దాదాపు అన్ని టోర్నీల్లో ఆడిన ఖెలిఫ్, యు టింగ్‌ను తప్పించడానికి గల కారణాలు ఏంటంటూ నిలదీసింది.