న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుపై అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(కాస్) పూర్తి స్థాయి తీర్పును వెలువరించింది. ఈనెల 14న ఏకవాక్య తీర్పునిచ్చిన కాస్ సోమవారం పూర్తి స్థాయి అంశాలను ప్రస్తావించింది. ఏకంగా 24 పేజీల సుదీర్ఘ వివరణలతో అనర్హతకు దారితీసిన కారణాలను నిబంధనలతో సహా వివరించింది. దీనికి తోడు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కేసులో అంశాలన్నింటినీ ప్రస్తావించింది. ముఖ్యంగా నిర్దేశిత బరువు ప్రమాణాలనేవి అథ్లెట్ల బాధ్యత అంటూ తీర్పులో స్పష్టంగా పేర్కొంది. రెండో రోజు బరువు లెక్కింపులో కేవలం 100 గ్రాముల తేడాతో 50కిలోల ఫైనల్ పోరుకు వినేశ్ అర్హత కోల్పోవడం ఒక రకంగా క్రూరమైనదిగా ప్రస్తావించింది.
తీర్పు సారాంశం ఇది: కాస్ తన తుది తీర్పులో అన్ని అంశాలను వివరంగా ప్రస్తావించింది. ముఖ్యంగా నిర్దేశిత బరువు విషయంలో అంతర్జాతీయ రెజ్లింగ్ సంఘం(యూడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐవోసీ) నిబంధనలను పేర్కొంది. అర్బిట్రార్ ఈ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఆమె(వినేశ్) 50కిలోల విభాగంలో పోటీపడుతున్నప్పుడు అందుకు తగ్గట్లు బరువు ఉండాలన్న సంగతి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఏండ్లుగా రెజ్లింగ్‌లో వివిధ విభాగాల్లో పోటీపడుతున్నది. ఆ మాత్రం తెలియకుండా ఉండటానికి లేదు. అందుకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు కూడా లేవు. బరువు నిబంధనలు అర్థం చేసుకోలేని స్థితిలో కూడా ఆమె లేదు. ఫోగాట్ స్వచ్చందంగా 50కిలోల విభాగంలో పోటీపడాలని అనుకున్నప్పుడు అందుకు తగ్గట్లు బరువును అదుపులో ఉంచుకోవాల్సింది. బరువు తగ్గించుకునేందుకు సమయం సరిపోలేదని చెప్పడం సరికాదు. ఆమె శరీర బరువు విషయంలో ఎవరూ కలుగజేసుకోలేదు. అర్టికల్ 7 ప్రకారం ఎవరైనా బరువు అనుకూలంగా ఏదైనా ఒక విభాగంలో పోటీపడేందుకు అర్హులు’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే క్యూబా రెజ్లర్‌తో కలిపి సంయుక్తంగా రజత పతక విజేతగా ప్రకటించాలన్న వినేశ్ అభ్యర్థనను కూడా కాస్ కొట్టివేసింది.
అనర్హత వేటు ఇలా : పారిస్ ఒలింపిక్స్‌లో ఈనెల 7న మహిళల 50కిలోల ఫ్రీస్టయిల్ బౌట్లో స్టార్ రెజ్లర్ వినేశ్ బరిలోకి దిగింది. తొలి రోజు మొత్తం మూడు బౌట్లలో వినేశ్ పోటీపడింది. తన తొలి బౌట్లో గత పదేండ్లలో ఓటమి ఎరుగని జపాన్ దిగ్గజ ర్లెజర్ యుయి సుసాకీపై సంచలన విజయం సాధించింది. అయితే మరుసటి రోజు ఉదయం జరిపిన బరువు పరీక్షల్లో వినేశ్ 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు ఫోగాట్‌పై వేటు వేస్తూ ఆమె చేతిలో సెమీస్‌లో ఓడిన క్యూబా రెజ్లర్‌కు ఫైనల్లో ఆడే అవకాశం కల్పించారు. దీనిపై వినేశ్..కాస్‌లో అప్పీల్ చేయగా, ఆమెకు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ)మద్దతుగా నిలిచి కేసు వాదించేందుకు న్యాయవాదులను నియమించింది. మూడు సార్లు వాయిదా వేసిన కాస్.. ఈనెల 14న తీర్పు ఇచ్చింది. గత శనివారం స్వదేశానికి చేరుకున్న వినేశ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.
బలాలి (హర్యానా): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు పలు రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి రూ. 16.35 కోట్ల నగదు బహుమతులు అందాయని వస్తున్న వార్తలపై ఆమె భర్త సోమ్‌వీర్ రాటీ స్పందించాడు. అవన్నీ ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేశాడు. తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా సోమ్‌వీర్ స్పందిస్తూ.. ‘వినేశ్ ఫోగాట్‌కు ఏ రాజకీయ పార్టీ నుంచి గానీ వ్యాపారవేత్తలు, కంపెనీలు, సంస్థల నుంచి గానీ ఒక్క రూపాయీ అందలేదు. మీరంతా మా క్షేమం కోరుకునేవారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు. వాటితో మాకు నష్టం వాటిల్లడమే గాక సామాజిక విలువలకూ నష్టమే’ అని రాసుకొచ్చాడు. ఈ మేరకు ట్వీట్లో ఎవరి వద్ద నుంచి ఎంతెంత వచ్చిందన్న వార్తలనూ ఆయన కొట్టిపారేస్తూ దానిని ‘చీప్ పాపులారిటీ’గా అభివర్ణించాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరుకు ముందు 100 గ్రాముల అదనపు బరువు ఉన్న వినేశ్ పతకాన్ని కోల్పోయినా హర్యానాలో ‘ఖాప్ పంచాయితీ’లు మాత్రం ఆమెకు ‘స్వర్ణ పతకం’ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇదే విషయమై సంగ్వాన్ ఖాప్ అధ్యక్షుడు, హర్యానాలో స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సోంబిర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచే విజేతలకు అందించే పసిడి పతకాన్ని పోలిన బంగారు పతకం వినేశ్‌కు అందజేస్తాం. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమె అనర్హత వేటును ఎదుర్కోవడం అనేది సహించరానిది. దీని వెనుక కుట్ర దాగి ఉంది. పతకం రాకపోయినప్పటికీ వినేశ్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది’ అని అన్నాడు. వినేశ్‌కు స్వర్ణ పతకం అందించే వేడుకను ఘనంగా నిర్వహించేదుకు ఖాప్ పంచాయితీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.