హాంకాంగ్ : ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం హాంకాంగ్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మంగళవారం నుంచి మొదలైన హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీ తొలిరౌండ్లో సాత్విక్-చిరాగ్.. 21-13, 18-21, 21-10తో సియాంగ్-వాంగ్ చి (తైవాన్) జోడీని ఓడించారు.
రెండో రౌండ్లో ఈ మాజీ ప్రపంచ నెంబర్ వన్ జోడీ జపాన్ షట్లర్లు మితుహాషి-ఒకమురాతో తలపడాల్సి ఉంది. ఇక పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రౌండ్లో కిరణ్ జార్జి.. 21-14, 21-13తో శంకర్ ముత్తుస్వామిని ఓడించి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.తెలంగాణ కుర్రాడు మన్నెపల్లి తరుణ్.. 28-26, 21-13తో మరో తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చినా మరో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతడు.. 23-21, 21-13, 18-21తో జస్టిన్ హో (మలేషియా) చేతిలో మెయిన్ డ్రాకు చేరకుండానే నిష్క్రమించాడు.