కోల్‌కతా: ప్రతిష్ఠాత్మక డ్యురాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) పోరాటం ముగిసింది. ఆసియాలోనే అతి పురాతన టోర్నీగా పేరొందిన డ్యురాండ్ కప్‌లో తొలిసారి బరిలోకి దిగిన హెచ్ఎఫ్సీ అంచనాలకు మించి రాణించింది. మ్యాచ్ మ్యాచ్‌కు తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయిన హెచ్‌ఎఫ్‌సీకి కీలకమైన సెమీఫైనల్లో చుక్కెదురైంది. గురువారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన సెమీస్ పోరులో హెచ్ఎఫ్సీ 0-1 తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్(బీఎఫ్సీ) చేతిలో పోరాడి ఓడింది.
హెచ్ఎఫ్సీ ప్లేయర్ ఓడెయ్ ఓనెడియా(30ని) సెల్ఫ్ గోల్‌తో ప్రథమార్ధంలోనే 1-0 ఆధిక్యంలోకి వెళ్లిన బెంగళూరు ఆఖరి వరకు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కాగా తొలి సెమీస్‌లో మొహమ్మదీన్ ఎఫ్‌సీపై 1-0 విజయంతో ముంబై సిటీ ఎఫ్‌సీ తొలిసారి డ్యురాండ్ కప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ముంబై సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీ తలపడుతాయి.