IPL 2024: భారత జట్టుకు చిన్న వయసులోనే అరంగేట్రం చేసి `భావి సెహ్వాగ్` అని పేరు దక్కించుకున్నా తర్వాత దానిని కాపాడుకోలేక ఫామ్ కోల్పోయి జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్న క్రికెటర్ పృథ్వీ షా. టాలెంట్ పరంగా షా లో లోపాలు వెతకడానికి ఏమీ లేకపోయినా ఫిట్నెస్, అతడి వ్యవహార శైలి మాత్రం అతడిని జట్టుకు దూరం చేస్తోంది. గత సీజన్లో విఫలమైనా ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని తిరిగి రిటైన్ చేసుకోవడంతో అతడి కెరీర్‌కు ఇదే ఆఖరి అవకాశమని భారత క్రికెటర్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు.
ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కుంబ్లే మాట్లాడుతూ.. `అతడు ఇంకా యువకుడే. షాకు చాలా మంచి భవిష్యత్ ఉంది. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌లు ఆ దిశగా దృష్టి సారించాలి. లేకుంటే మాత్రం షా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది. చాలాకాలంగా షా గురించి చర్చ వచ్చినప్పుడల్లా అందరూ అతడి ఫిట్నెస్ గురించే మాట్లాడతారు. అతడి క్రికెటింగ్ స్కిల్స్ గురించి ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. అతడు క్రీజులో కుదురుకుంటే టీ20లలో ఆట స్వరూపాన్నే మార్చగలడు..`అని తెలిపాడు.
తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన గిల్ ఓ వైపు అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకుని తన స్థానాన్ని పదిలం చేసుకుంటే షా మాత్రం ఇంకా బాలారిష్టాలను దాటడం లేదని కుంబ్లే అన్నాడు. రాబోయే సీజన్ పృథ్వీ షాకు అత్యంత కీలకమని, ఒకవేళ 2024లో కూడా వైఫల్య ప్రదర్శన కొనసాగిస్తే ఇక అతడి కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనని హెచ్చరించాడు. దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగుల వరద పారిస్తున్న షా.. జాతీయ జట్టులోకి మాత్రం రావడం లేదు. ఒకవేళ వచ్చినా అతడికి తుది జట్టులో ఉండే అవకాశాలు దక్కడం లేదు.