సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 12, 2020 , 02:18:53

పాండ్య ఫెయిల్‌

పాండ్య ఫెయిల్‌
  • ఫిట్‌నెస్‌ పరీక్షలో హార్దిక్‌ విఫలం
  • కివీస్‌ టూర్‌కు దూరం..!
  • న్యూజిలాండ్‌ పర్యటనకు నేడు భారత జట్ల ఎంపిక

ముంబై: టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటకు దూరమైన అతడు న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికవుతాడని అందరూ అంచనా వేశారు. అయితే, ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమైన కారణంగా కివీస్‌ పర్యటనకు పాండ్య దాదాపు దూరమైనట్టే. జనవరి 24 నుంచి ఆరు వారాల పాటు జరిగే న్యూజిలాండ్‌ పర్యటన కోసం భారత జట్లను సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ఎంపిక చేయనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో టీమ్‌ఇండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కోసం 15మందితో కూడిన జట్లను కాకుండా 16లేదా 17మందిని ఎంపిక చేసే అవకాశమున్నట్టు సమాచారం. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగనుండడంతో పొట్టి ఫార్మాట్‌ జట్టుపైనే అందరి దృష్టి ఉంది. గతేడాది సెప్టెంబర్‌ చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ తర్వాత వెన్నునొప్పి తీవ్రమవడంతో శస్త్రచికిత్స చేయించుకున్న భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇటీవల కోలుకున్నట్టే కనిపించాడు. దీంతో కివీస్‌ పర్యటనకు అతడు ఎంపిక కావడం ఖాయమేనని వాదనలు వినిపించాయి. అయితే, జట్టులోకి మళ్లీ వచ్చేందుకు ఫిట్‌నెస్‌ పరీక్ష తప్పనిసరి కాగా.. శనివారం జరిగిన టెస్టులో పాండ్య విఫలమయ్యాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు కివీస్‌ పర్యటనలో మూడు ఫార్మాట్లలో చోటు ఖాయం. ఇది మినహా స్వదేశంలో లంకను చిత్తుచేసిన.. కోహ్లీసేనే న్యూజిలాండ్‌తో టీ20లకు ఎంపిక కానుంది. కాగా, భారత్‌-ఏ జట్టులో హార్దిక్‌ స్థానాన్ని తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయశంకర్‌ భర్తీ చేయనున్నాడు.

ముగ్గురిలో ఎవరో..

ఇటీవల స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న కేదార్‌ జాదవ్‌కు కివీస్‌కు వెళ్లే భారత వన్డే జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. అతడి టెక్నిక్‌ న్యూజిలాండ్‌ పిచ్‌లకు సరిపోదని సెలెక్టర్లు భావిస్తే టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మళ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త ఆటగాడివైపు చూస్తే మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌ పేరు తెరమీదకు రావొచ్చు. 5,6 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి హిట్టింగ్‌ చేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో సహా ఐపీఎల్‌ల్లోనూ యాదవ్‌ మంచి ప్రదర్శన చేశాడు. ఇక కివీస్‌ పర్యనట కంటే ముందు స్వదేశంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ సైతం జట్టులో కొనసాగనున్నాడు. ఇది మినహా గత నెల విండీస్‌పై ఆడిన ఆటగాళ్లే కివీస్‌తో 50ఓవర్ల సిరీస్‌లో ఉండే అవకాశం ఉంది.

మూడో ఓపెనర్‌ కోసం పోటీ..

స్వదేశంలో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టే దాదాపుగా కివీస్‌తో టెస్టులకు ఎంపికయ్యే చాన్స్‌ ఉన్నా... మూడో ఓపెనర్‌ స్థానం కోసం పోటీ తీవ్రంగా మారింది. రోహిత్‌, మయాంక్‌ అగర్వాల్‌ రెగ్యులర్‌ ఓపెనర్లుగా ఉండగా.. రిజర్వ్‌ ఓపెనింగ్‌ స్థానం కోసం శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ మధ్య పోటీ నెలకొంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ గిల్‌ అదరగొడుతుంటే.. టీమ్‌ఇండియా తరఫున కేఎల్‌ రాహుల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విజృంభిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఎవరికి చాన్స్‌ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టెస్టుల్లో పేసర్లుగా బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ చోటు పక్కా కాగా ఐదో పేసర్‌ను తీసుకోవాలంటే సైనీకి పిలుపురావొచ్చు. ఒకవేళ మూడో స్పిన్నర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయిస్తే అశ్విన్‌, జడేజాకు కుల్‌దీప్‌ యాదవ్‌ జతకలుస్తాడు.


logo